గోదావరి మహోగ్ర రూపం చల్లారినా.. లంక గ్రామాల్లో.. లోతట్టు ప్రాంతాల్లో వరద పరిస్థితులు మాత్రం కుదుటపడడం లేదు. కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో లంక గ్రామాలతోపాటు లంకల్లోని వ్యవసాయ, ఉద్యాన పంటలన్నీ జలదిగ్బంధంలో ఉన్నాయి. వారం రోజులుగా వరద నీటిలోనే నానుతుండడంతో కుళ్లిపోయి వేలమంది రైతులు నష్టపోయారు. చాలా గ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. మిగిలినవి బురదతో నిండిపోయాయి. ముంపు తగ్గడంతో పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుతున్న బాధితులు పూర్తిగా పాడైపోయిన ఇళ్లు, వస్తువులను చూసి గుండెలు బాదుకుంటున్నారు. వరద ప్రభావం తగ్గడానికి మరోవారం రోజులు పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. బాధితులు కోలుకోడానికి ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి.
ఏలూరు జిల్లా వేలేరుపాడు వీధుల్లో ఎటు చూసినా చెత్త, చెదారమే కనిపిస్తోంది. స్థానికులంతా ఇళ్లు, దుకాణాల్లోని సామగ్రిని శుభ్రపరుచుకుంటున్నారు. విద్యుత్తు స్తంభాలపై నుంచి వరదనీరు ప్రవహించడంతో తీగలకు వ్యర్థాలు చుట్టుకుపోయాయి. వేలేరుపాడులోని జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పంపిణీ చేసేందుకు తెచ్చిన పుస్తకాలన్నీ వరదనీటిలో నానిపోయాయి. మధ్యాహ్న భోజనం కోసం తెచ్చిన గుడ్లు, బియ్యం తదితర సామగ్రి, సిబ్బంది బీరువాలు, అలమరాల్లో ఉంచిన సామగ్రి, కంప్యూటర్ పాడైంది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పోలవరం ముంపు మండలాల్లో చాలా ఇళ్లు నేలకొరిగాయి. రూ.లక్షల విలువైన వస్తువులు పాడవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో. వరద నీటితోనే బాధితులు ఇళ్లు, దుకాణాలు శుభ్రం చేసుకుంటున్నారు. చింతూరు-భద్రాచలం జాతీయ రహదారి 30పై కిలోమీటర్ల దూరం ఒండ్రు మట్టి నిలిచిపోయింది. చింతూరు నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు ఇంకా రాకపోకలు జరగడం లేదు.
సముద్రంలోకి 15,21,287 క్యూసెక్కులు:ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటి మట్టం 14.5 అడుగులకు చేరింది. సముద్రంలోకి 13.94 క్యూసెక్కులు, కాలువల్లోకి5,400 క్యూసెక్కులు విడిచిపెట్టారు. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత 70 లంక గ్రామాలతోపాటు.. వాటి పరిధిలోని 104 ఆవాస ప్రాంతాల తాజా పరిస్థితిపై అధికారులు దృష్టిసారించారు. 40 వేల కుటుంబాలు వరద తాకిడికి గురైనట్లు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు లంక గ్రామాల ప్రజలకు సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యారు. పరిస్థితి కుదుటపడే వరకు పునరావాస కేంద్రాలు, ఇతర సేవలు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. నిత్యావసరాలు, ప్రభుత్వం ప్రకటించిన పరిహారం పంపిణీపై దృష్టిసారించారు.
405 గ్రామాలపై వరద ప్రభావం:ఆరు జిల్లాల్లోని 405 గ్రామాలపై వరదల ప్రభావం పడగా.. 326 గ్రామాలు నీట మునిగాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 165 గ్రామాలు ముంపు బారిన పడగా.. అందులో 143 నీటిలో మునిగినట్లు తెలిపింది. కోనసీమలో 1.96 లక్షల మందిపై వరద ప్రభావం పడింది. వరద తాకిడి మొదలైన నాటి నుంచి చోటు చేసుకున్న వివిధ సంఘటనల్లో ముగ్గురు చనిపోయారని పేర్కొంది. గోదావరి వరద ప్రభావిత గ్రామాల్లో సహాయ చర్యలకు రూ.26.83 కోట్లు ఖర్చు చేశామని తెలిపింది. 85,218 కుటుంబాలకు 2,511 టన్నుల బియ్యం, 133.49 టన్నుల కందిపప్పు, 47,964 లీటర్ల పామోలిన్, 1,02,285 లీటర్ల పాలు, 128 టన్నుల ఉల్లి, 115 టన్నుల బంగాళా దుంపలు పంపిణీ చేశామని వివరించింది. ఆరు జిల్లాల్లో రూ.1.66 కోట్ల విలువైన 1,390 టన్నుల సంపూర్ణ పోషక దాణాను సరఫరా చేశామని తెలిపింది. వరదల కారణంగా ఆరు జిల్లాల పరిధిలో 27 వేల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ నివేదిక వెల్లడించింది.
పునరావాసంలో మరణ యాతన:చుట్టూ వరద.. ఎటువెళ్లడానికీ దారీతెన్నూ లేని పరిస్థితి. సొంత ఊరు మునిగిపోయింది. ఇలాంటి కష్టాల్లో ఉన్న సమయంలో ఇంట్లో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు మరింత నరకయాతన తప్పడంలేదు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామమైన కోండ్రుకోట పంచాయతీ పరిధిలోని 208 గిరిజనేతర కుటుంబాలకు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం సాగిపాడు వద్ద పునరావాస కాలనీ నిర్మించారు. వరదల కారణంగా నిర్వాసితులంతా ఇక్కడే ఉంటున్నారు. బుధవారం ఖండవల్లి రాంబాబు అనే వ్యక్తి మరణించడంతో అంత్యక్రియలు పెద్ద సమస్యగా మారిపోయింది. మృతదేహంతో 41 కిలోమీటర్లు ప్రయాణించి.. పోలవరం, తాళ్లపూడి మండలాలు దాటుకుని కొవ్వూరు తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చింది.
ఇవీ చదవండి: