రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఒక వైపు నత్తనడకన సాగుతుంటే.. మరికొన్ని ప్రాజెక్టులు ప్రాధాన్య జాబితాలో చేర్చడం చర్చనీయాంశమవుతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.1,078 కోట్లు వెచ్చించి ఐదు ప్రాజెక్టులు పూర్తి చేయాలనుకున్న చిన్న ప్రణాళికే ఇంతవరకు అమలు చేయలేకపోయారు. అలాంటిది తొలి, మలి ప్రాధాన్య ప్రాజెక్టుల్లో మరిన్ని కొత్త ప్రాజెక్టులను ముఖ్యమంత్రి సూచనల మేరకు జలవనరులశాఖ అధికారులు చేర్చారు. నిధులు వెచ్చించి, పనుల వేగం పెంచి ఒక్కో ప్రాజెక్టు పూర్తి చేస్తూ వెళ్లే ఒరవడిలో మరికొన్ని కొత్తవాటికి ప్రాధాన్య స్థితి కల్పించారంటే అర్థం ఉంటుంది.
ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన సాగుతున్న సందర్భంలో కాగితాలపై ప్రాధాన్యాలు నిర్ణయించుకుని సాధించేదేముందనే చర్చ జలవనరులశాఖలోనే జరుగుతోంది. ప్రస్తుతం ప్రాధాన్య జాబితాలో చేర్చిన ప్రాజెక్టులు నిర్మాణపరంగా కీలకమైనవి. కేవలం ప్రాధాన్య జాబితాలో చేర్చడం కాకుండా వాటికి నిధులిచ్చి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జలవనరుల శాఖలో రూ.11,482 కోట్లు వెచ్చించాలని అంచనాగా రూపొందించారు. తొలి 4నెలల్లో జీతాలతో కలిపి రూ.2,200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని సమాచారం. మరోవైపు ఈ ప్రభుత్వం వచ్చాక 3 ఆర్థిక సంవత్సరాల్లో సాగునీటి రంగంపై ఖర్చు చేసిన మూలధన వ్యయం రూ.15,393 కోట్లు. కొత్త, పాత ప్రాజెక్టులకు కలిపి మొత్తం రూ.1.36 లక్షల కోట్లు అవసరమన్న లెక్కలున్న నేపథ్యంలో ఈ స్థాయి ఖర్చుతో ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయన్నది పెద్ద ప్రశ్నే. ప్రాజెక్టులు ఆలస్యమయ్యే కొద్దీ అంచనా ధరలు, నిర్మాణ వ్యయం పెరిగిపోవడం అనే మరో పెద్ద సవాలు ముందు నిలుస్తుంది.
కేవలం రెండు ప్రాజెక్టులు కొలిక్కి...:2020-21 ఆర్థిక సంవత్సరంలో తక్కువ నిధులు ఖర్చుచేస్తే పూర్తి చేయగలమనుకున్న 5 ప్రాజెక్టుల్లో నెల్లూరు, సంగం బ్యారేజి నిర్మాణాలు పూర్తయ్యాయని.. ఆగస్టులో ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెలలో ఏదో ఒక రోజున వాటిని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. నెల్లూరు బ్యారేజికి రూ.94 కోట్లు, సంగం బ్యారేజికి రూ.64 కోట్లు వెచ్చిస్తే ఆ రెండు ప్రాజెక్టులు ఏడాదిలోపు పూర్తి చేయవచ్చని 2019 నవంబరులోనే ప్రణాళిక రూపొందించారు. ఇవి మూడున్నరేళ్లకు పూర్తయ్యాయి. నిర్మాణంలో ఉన్న మరో 42 ప్రాజెక్టులను 2024నాటికి పూర్తి చేస్తామని అప్పట్లోనే ప్రణాళిక రూపొందించినా.. ఇప్పటికీ వాటిలో చెప్పదగ్గ పురోగతి లేదు. అలాంటిది ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు కొన్ని ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలోకి చేర్చడం గమనార్హం. నిధులివ్వకుండా, పనుల్లో వేగం పెంచకుండా కేవలం ప్రాధాన్య హోదా ఇచ్చి సాధించేదేముందన్న విమర్శలున్నాయి.
- 2019 నవంబరు నాటికి రూపుదిద్దుకున్న ప్రణాళిక ప్రకారం.. అప్పటికి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులలో 25శాతంలోపు మాత్రమే పనయిన వాటిల్లో ఏవి అవసరమో అధ్యయనం చేసి కొన్నింటిని రద్దు చేశారు. ఆ ప్రక్రియ తర్వాత పోలవరం కాకుండా 42 ప్రాజెక్టులను నిర్మించాల్సి ఉందని గుర్తించారు. ఇందుకు రూ.24,092 కోట్లు అవసరమని అంచనా వేశారు.
- అందులో రూ.1,078 కోట్లు వెచ్చించి 2010-21 ఆర్థిక సంవత్సరంలో ఐదు ప్రాజెక్టులు పూర్తి చేయగలమని ప్రకటించారు. నెల్లూరు, సంగం బ్యారేజీలు, అవుకు రెండోటన్నెల్, వంశధార నాగావళి అనుసంధానం, వంశధార రెండో దశ రెండో భాగం పనులు, వెలిగొండ తొలి టన్నెల్‌నుంచి నీళ్లివ్వడం వంటివి అందులో చేర్చారు.
- 2024లోపు మిగిలిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలనేది ప్రణాళిక. మూడున్నరేళ్లలో కొలిక్కి వచ్చినవి నెల్లూరు, సంగం బ్యారేజిలు మాత్రమే.
- 40పాత ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. ఎప్పటికి పూర్తి చేయగలరో కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు.