ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా విజృంభణ వేళ... టీకాలు నిండుకుంటున్నాయ్‌..! - ap corona vaccine problem news

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోన్న వేళ లబ్ధిదారులు టీకాలు అందక ఆందోళన చెందుతున్నారు. కొన్ని జిల్లాల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ అందుకు సరిపడా టీకాలు లేవు. తొలి డోసు వేసుకున్నవారు సైతం రెండు డోసు కోసం నిరీక్షించక తప్పడం లేదు. ఇప్పటివరకు ఆరోగ్య కార్యకర్తలకు వయస్సుతో సంబంధం లేకుండా టీకా వేస్తుండగా... ఈ వెసులుబాటును వైద్య ఆరోగ్యశాఖ తాజాగా తొలగించింది.

corona vaccine
కరోనా వ్యాక్సిన్ ఏపీ

By

Published : Apr 8, 2021, 7:49 AM IST

రాష్ట్రంలో కరోనా టీకాల నిల్వలు అయిపోతున్నాయి. నెల్లూరు, పశ్చిమగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో అవసరాలకు సరిపడ టీకాలు లేక.. లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రాష్ట్రంలో సుమారు 5 లక్షల డోసులే ఉన్నాయి. కానీ అవసరం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం సరఫరా చేస్తున్న రెండు టీకాల్లో ఒకటే కాస్త అందుబాటులో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 1,633 కేంద్రాల ద్వారా 2,32,355 మందికి టీకా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. వీరిలో 90,947 మందికే పంపిణీ చేశారు. తొలి డోసులో వేయించుకున్న టీకానే రెండోసారీ వేయించుకోవాలి. వీరి అవసరాలకు తగ్గట్లు టీకా అందుబాటులో లేక.. లబ్ధిదారులు కంగారుపడుతున్నారు. నెల్లూరు జిల్లాకు మొత్తం 2,22,330 డోసులు రాగా.. వీటిలో 2,21,000 పంపిణీ చేశారు. మంగళవారం సాయంత్రం నుంచి జిల్లాలో టీకా నిల్వలు బాగా తగ్గాయి. దీంతో కర్నూలు జిల్లా నుంచి తెప్పించిన ఐదువేల డోసుల్లో నెల్లూరుకు 4వేలు, కావలికి 1,000 డోసులు సర్దుబాటు చేశారు. బుధవారం ఈ డోసుల పంపిణీ దాదాపుగా జరిగింది. విజయనగరం నుంచి 5వేల డోసులు తెప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
విశాఖ నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు..
పశ్చిమగోదావరి జిల్లాలోనూ మంగళవారం సాయంత్రానికే టీకాలు నిండుకున్నాయి. విశాఖ, ఇతర జిల్లాల నుంచి తెప్పించి లబ్ధిదారులకు ఇస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం, కల్యాణదుర్గం ప్రాంతాలకు కేటాయించిన టీకా పంపిణీ రెండు రోజుల నుంచి జరగడంలేదు. ఇక్కడ 33 కేంద్రాలను ఏర్పాటుచేసినా, తక్కువ కేంద్రాల్లోనే పంపిణీ జరుగుతోంది. గుంటూరు జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. కృష్ణాజిల్లాలో ఫలానా టీకాయే కావాలని లబ్ధిదారులు చెబుతున్నందున అది అందుబాటులో లేదని అధికారులు అంటున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు కేంద్రం నుంచి టీకాల పంపిణీ జరగడం లేదు. జిల్లా అధికారులు టీకాల పంపిణీ, నిల్వలపై కచ్చితమైన ప్రతిపాదనలు పంపకపోవడం, పర్యవేక్షణ లోపం వల్ల కూడా టీకాల రాక ఆలస్యం అవుతోంది.
2 రోజుల్లోగా 2 లక్షల డోసుల టీకా
జిల్లాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. రాష్ట్రానికి ఒకటి, రెండు రోజుల్లో రెండు లక్షల డోసులు, మరో వారంలోగా పది లక్షల డోసుల టీకాలు వస్తున్నాయి. డిమాండ్‌ ఉన్న చోటకు టీకా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
ఆరోగ్య సిబ్బందికీ 45 ఏళ్లు ఉండాల్సిందే
ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల కేటగిరీలో ఉండేవారికి వయస్సుతో నిమిత్తం లేకుండా ఇటీవల వరకు టీకా పంపిణీ చేశారు. ఈ వెసులుబాటును వైద్య ఆరోగ్యశాఖ తాజాగా తొలగించింది. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌ కేటగిరీలో పేర్లు నమోదు చేస్తున్నా... 45 ఏళ్లు ఉంటేనే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ జరుగుతుంది. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. ఈ కేటగిరీల వారు తమ గుర్తింపుకార్డును ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తే పరిశీలించాకే టీకా వేయిస్తారు.

ABOUT THE AUTHOR

...view details