ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Kidney Failure Disease: మూత్రపిండాలకు ముప్పు... ఏటా పెరుగుతున్న బాధితులు

మూత్రపిండాలకు ముప్పు పొంచి ఉంది. క్రమేణా ప్రాణాపాయానికి దారి తీసే కిడ్నీల వైఫల్య వ్యాధి భయపెడుతోంది. తెలంగాణలో ఏటేటా పెరుగుతున్న బాధితుల సంఖ్య అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.

kidney-failure-is-a-life-threatening-disease
మూత్రపిండాలకు ముప్పు... ఏటా పెరుగుతున్న బాధితులు

By

Published : Nov 26, 2021, 10:39 AM IST

మూత్రపిండాలకు ముప్పు పొంచి ఉంది. క్రమేణా ప్రాణాపాయానికి దారి తీసే కిడ్నీల వైఫల్య వ్యాధి భయపెడుతోంది. తెలంగాణలో ఏటేటా పెరుగుతున్న బాధితుల సంఖ్య అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. రాష్ట్రంలో 2014-15లో 5,598 మంది బాధితులు ఆరోగ్యశ్రీ పథకం కింద నమోదవగా, 2020-21 నాటికి ఆ సంఖ్య 10,848కు పెరగడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.

ఆరేళ్లలో రూ. 576 కోట్లు..

గత ఆరేళ్ల కాలంలో ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్‌ చికిత్సల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.576 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. ఇంకా ఈఎస్‌ఐ, ఆర్‌టీసీ, సింగరేణి, సీజీహెచ్‌ఎస్‌, ఈజేహెచ్‌ఎస్‌ తదితర పథకాల్లో గుర్తించిన కేసులను, ప్రైవేటు-కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో నమోదవుతున్న వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే బాధితుల సంఖ్య దీనికి రెట్టింపు ఉంటుందని వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి.

నాణ్యమైన వైద్యసేవలు అందకపోవడం, మూత్రపిండాల మార్పిడికి అవసరమైన పరిస్థితులు లేకపోవడం వంటి కారణాలతో బాధితుల మరణాలు కొనసాగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ గణాంకాల ఆధారంగా చూస్తే వ్యాధిగ్రస్థుల్లో అత్యధికులు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. సమస్య వచ్చాక చికిత్స కోసం అవస్థలు పడేకంటే వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే శ్రేయస్కరమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

జీవన్మృతులు దొరికితేనే..

దాతలు అందుబాటులో లేకపోవడంతో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు అతి స్వల్పంగా జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులు కిడ్నీని దానం చేయడానికి ముందుకురాని పరిస్థితుల్లో అత్యధికులు జీవన్మృతుల(బ్రెయిన్‌ డెడ్‌) కోసమే ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ చికిత్స అందుబాటులో లేనప్పుడు రక్తశుద్ధి(డయాలసిస్‌) తప్ప మరో గత్యంతరం ఉండటం లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో 43 ఆసుపత్రుల్లో సుమారు 450 పరికరాలతో డయాలసిస్‌ కేంద్రాలను నెలకొల్పింది. ఒక్కో పరికరంతో రోజుకు నలుగురికి డయాలసిస్‌ చేయొచ్చు. అయినా రోగుల సంఖ్య పెరుగుతుండడంతో రక్తశుద్ధి సేవలకు గిరాకీ పెరిగింది. ఆ నేపథ్యంలో డయాలసిస్‌ పరికరాలను అవసరాలకు తగ్గట్లుగా పెంచాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.

ఉచిత మార్పిడి, జీవితకాలం మందులు

వ్యాధిగ్రస్థుల్లో ఎక్కువ మంది పేద మధ్య తరగతి వారే కావడం, చికిత్స పొందే క్రమంలో వారు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కిడ్నీ మార్పిడి చికిత్సలు అందిస్తోంది. జీవితకాలం మందులనూ అందిస్తోంది. బాధితులు డయాలసిస్‌ కేంద్రాలకు వచ్చి వెళ్లేందుకు వీలుగా బస్‌ పాసులు కూడా ఇస్తోంది.

మధుమేహం, బీపీ అదుపులో ఉంటేనే...

సాధారణంగా మూత్రపిండాలు దెబ్బతినడానికి ప్రధానంగా అధిక రక్తపోటు, మధుమేహం కారణమవుతున్నాయి. ఈ రెండింటినీ అదుపులో ఉంచుకోవాలి. వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా మందులు వాడాలి. నడక, శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన ఆహారం వంటివి మేలుచేస్తాయి. ముఖ్యంగా సురక్షితమైన తాగునీరు ఈ జబ్బుల బారినపడకుండా కాపాడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు, ఇన్‌ఫెక్షన్లకు సత్వర చికిత్స పొందడం ద్వారా కిడ్నీ వైఫల్యానికి గురికాకుండా అడ్డుకోవచ్చు.

ఇదీ చూడండి:ఆ వయసు వారు ఎత్తు పెరగాలంటే బరువు తగ్గాల్సిందేనా?

ABOUT THE AUTHOR

...view details