తెలుగులోగిళ్లు పండుగ శోభను సంతరించుకున్నాయి. భాద్రపద మాసంలో వచ్చే అతిపెద్ద పండుగ వినాయక చవితి. భూదేవంత అరుగు.. ఆకాశ మంత పందిళ్లు.. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు, ఎలాంటి వారిచేతనైనా డ్యాన్స్ చేయించే హుషారైన సంగీతం.. ఇలా ఒకటా రెండా.. గణనాథుడి ఉత్సవాలు గుర్తొస్తే.. ఎలాంటి వారికైనా పూనకం వస్తుందనడంలో అతిశయోక్తి లేదు. గణపతి ఉత్సవాల్లో ప్రత్యేకంగా చెప్పుకునేది ఖైరతాబాద్ గణపతి విగ్రహం గురించే.
ఏటా ప్రత్యేకమైన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణేశుడు ఈసారి శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా (sri Panchamukha Rudra Maha ganapati) భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమయ్యాడు. కొవిడ్ వల్ల గతేడాది ఉత్సవాలు నిరాడంబరంగా నిర్వహించినప్పటికీ... ఈసారి భారీగా ఏర్పాట్లు చేస్తోంది ఉత్సవ కమిటీ. ఈ ఏడాది గణపతి విగ్రహం ఎత్తును 40 అడుగులకే పరిమితం చేశారు. విగ్రహం తయారీ పూర్తయి.. ముందున్న కర్రలు తొలగించడంతో చవితికి ముందు నుంచే భక్తులు.. గణపతి విగ్రహం వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.
2019లో మహా గణపతిగా...
గణపతి పండుగ వస్తుందంటే చాలు.. అందరి చూపు ఖైరతాబాద్ గణపతి వైపే. ఏటా ప్రత్యేకమైన అవతారంలో దర్శనమిస్తుంటాడు విఘ్నేశ్వరుడు. 2019లో శ్రీ ద్వాదశదిత్య మహా గణపతి రూపంలో 61 అడుగులు, పది తలలతో సూర్య భగవానుని రూపడై భక్తులకు దర్శనమిచ్చాడు.
2020లో ఉత్సవాలపై కొవిడ్ ప్రభావం