స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ప్రాదేశిక నియోజకవర్గాల నామినేషన్ల ప్రక్రియతో గ్రామాల్లో పూర్తి స్థాయి సందడి ప్రారంభమైంది. ఇప్పటి వరకు లోగుట్టుగా సాగిన రాజకీయం ఇక తెరపైకి వచ్చింది. పోటీకి అనేక మంది ఉత్సాహం చూపిస్తున్నా పార్టీలు మాత్రం గెలిచే అవకాశాలు ఉన్న వారికోసం అన్వేషిస్తున్నాయి. నామినేషన్లను సమర్పించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవి అవసరం :
- ఎంపీటీసీగా పోటీ చేసే అభ్యర్థులు పూర్తి వివరాలు పొందుపరచాలి.
- పోటీ చేసే అభ్యర్థి పేరు అదే మండల పరిధిలోని ఓటరు జాబితాలో ఉండాలి. ప్రతిపాదించే వ్యక్తి అదే ప్రాదేశిక నియోజకవర్గానికి సంబంధించిన ఓటరుగా ఉండాలి.
- ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ చోట్ల నామినేషన్లు వేసినా, ఉపసంహరణ రోజు తాను నిలిచే ప్రాంతం తప్ప మిగిలిన చోట్ల ఉపసంహరించుకోవాలి.
- అన్ని వివరాలు పూర్తి చేసిన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి సమర్పించే ముందు ఒకటి, రెండు సార్లు సరిచూసుకోవాలి. తప్పులు దొర్లాయా? విధి, విధానాలన్నీ పూర్తి చేశామా.. లేదా అనే కోణంలో చూడాలి.
- సంబంధిత అధికారినుంచి నామినేషన్ అందినట్లుగా రసీదు పొందాలి.
- ఆయా పార్టీ గుర్తులు కేటాయించాలంటే తప్పకుండా సంబంధిత పార్టీనుంచి బీఫారమ్‌ను జతపరచాలి.
జత చేయాల్సినవి..
- ఎస్సీ, ఎస్టీ, బీసీ కోసం రిజర్వు అయిన స్థానాల్లో పోటీ చేయాలనుకుంటే అభ్యర్థి తన నామినేషన్ ఫారంలో ఏవర్గానికి చెందిన వాడో ధ్రువీకరించాలి.
- దీని ద్వారా నామినేషన్‌కు చేయాల్సిన డిపాజిట్ రాయితీని పొందవచ్చు.
- వయస్సు నిర్ధారిత పత్రాలు, తగిన ధ్రువీకరణ పత్రాలు జతచేయాలి.
- ప్రతి అభ్యర్థి రాష్ట్ర ఎన్నికల సంఘం కోరిన విధంగా నేరపరమైన పూర్వాపరాలు, ఆస్తిపాస్తులు, విద్యార్హతలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాలి.