ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు-2020పై రాష్ట్రాల అభిప్రాయాలు తెలపాలని కేంద్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానికి కేసీఆర్ లేఖ రాశారు. రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపే బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ముసాయిదా బిల్లులో తమకు అభ్యంతరకరంగా ఉన్న అంశాలను సీఎం లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ నియంత్రణా మండలి నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం సహా ప్రత్యేక పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రాల బాధ్యతలు అప్పగించడం... రాష్ట్రాల అధికారాలను లాక్కోవడమేనని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు.
ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలను చట్టాల ద్వారా పూర్తిగా కేంద్రం చేతిలోకి తీసుకోవడం సరికాదని... ఈ తరహా వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జాతీయ పునరుత్పాదక ఇంధన విధానాన్ని రాష్ట్రాల ఆమోదంతో చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రాల్లో ఉండే విభిన్న పరిస్థితుల వల్ల విధానాల రూపకల్పనలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండాలని అన్నారు. ప్రతిపాదిత సవరణ వల్ల ఎన్ఎల్డీసీ బలోపేతం అవుతుందని... తద్వారా రాష్ట్రాల బొగ్గు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రాల యూనిట్లు కేంద్రానికి చెందిన ఎన్టీపీసీ, ఎన్హెచ్పీపీ లాంటి వాటితో పోటీ పడలేవని, అప్పుడు వాటికి తగిన ప్రాధాన్యత ఉండదన్నారు. అంతర్ రాష్ట్ర విద్యుత్ సరఫరా నిర్ణయాలను ఎస్ఎల్డీసీలకే వదిలేయాలని సూచించారు. చెల్లింపుల భద్రత అమలు లాంటి అధికారాలను ఎన్ఎల్డీసీకి ఇవ్వడం సబబు కాదని, కేవలం షెడ్యూలింగ్, సామర్థ్యం లాంటి సాంకేతిక అంశాలను మాత్రమే ఎన్ఎల్డీసీకి ఉండాలని సూచించారు.