తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 364 తెలంగాణలో ఇప్పటివరకూ 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 45 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. గాంధీలో 308 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని చెప్పారు. 11 మంది మృతి చెందారని, వీరందరూ మర్కజ్ వెళ్లి వచ్చిన వారేనన్నారు.
దేశంలో జూన్ 3 వరకు లాక్‌డౌన్ కొనసాగించాలని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సూచించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. లేకుంటే పరిస్థితి అదుపు తప్పుతుందని హెచ్చరించినట్లు వెల్లడించారు.
ఇప్పటి వరకు లాక్‌డౌన్‌కు ప్రజలు అద్భుతంగా సహకరించారన్న కేసీఆర్.. ఇక ముందు కూడా ఇలానే సహకరించాలని కోరారు. లాక్‌డౌన్ వల్లనే దేశాన్ని, తెలంగాణ సమాజాన్ని బతికించుకున్నామన్నారు. భారత్ లాంటి దేశాల్లో లాక్‌డౌన్ తప్ప వేరే మార్గం లేదని స్పష్టం చేశారు.
ప్రధానితో రోజుకు రెండుసార్లు మాట్లాడుతున్నానన్న సీఎం.. పరిస్థితిని అధిగమించేందుకు తీవ్రంగా చర్చించినట్లు తెలిపారు. ఇంతకు ముందు ఎన్నడూ ఇలాంటి సందర్భాలు లేవని.. బయటికి రానివ్వడం లేదని ఎవరూ బాధపడొద్దని విజ్ఞప్తి చేశారు.
కరోనా చాలా విచిత్రమైనదని.. ప్రస్తుతానికి మందు లేదన్నారు. ప్రాథమిక దశలో వస్తేనే బతకించుకోవచ్చని పేర్కొన్నారు. తీవ్రరూపం దాల్చిన తర్వాత ఆస్పత్రికి వచ్చినవారే చనిపోతున్నారని.. ప్రాథమిక దశలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆస్పత్రికి రావాలని కోరారు. పరిస్థితి విషమించిన తర్వాత వచ్చిన వ్యక్తులకు వెంటిలేటర్ పెట్టే లోపే చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఆదాయం తగ్గింది..
తెలంగాణలో రోజుకు రూ.430 కోట్ల ఆదాయం రావాల్సి ఉందన్నారు. ఏప్రిల్ నెల ఈ ఆరు రోజుల్లో రూ.2,400 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా.. కేవలం రూ.6 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. కరోనా వల్ల ఆదాయం తగ్గినా మరణాలు లేవన్నారు.
జపాన్, సింగపూర్, పోలాండ్, యూకే, డెన్మార్క్, పెరూ, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ సహా 22 దేశాల్లో 100శాతం లాక్డౌన్ను నెలరోజుల పాటు నిర్వహించినట్లు తెలిపారు. 90 దేశాల్లో పాక్షికంగా లాక్‌డౌన్ అమలవుతున్నట్లు పేర్కొన్నారు. దేశాలు లాక్‌డౌన్ అమలు చేయడమంటే చాలా పెద్ద అంశమన్నారు. అమెరికా మాదిరిగా మనదేశంలో వస్తే ఆగమయ్యేవాళ్లమని కేసీఆర్ అన్నారు.
ఇవీచూడండి:'దేశంలో కరోనా కేసులు, మృతుల్లో పురుషులే అధికం'