పసుపు జెండా చూడగానే జగన్ ఎందుకు వణికిపోతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ప్రశ్నించారు. చంద్రబాబు కడప జిల్లా పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ప్లెక్సీలను తొలగించే అధికారం ఎవరిచ్చారని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో తెలుగుదేశానికి వస్తున్న ఆదరణ చూసి వైకాపా హడలిపోతోందన్నారు. సీఎం సొంత జిల్లాలో ఇతర పార్టీ జెండాలు, ప్లెక్సీలు కట్టడానికి వీల్లేదా అని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షపార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించే హక్కులేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమూ లేక రాచరికమా అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాలు, జాతీయజెండా, మహాత్మాగాంధీని సైతం వదలకుండా వైకాపా రంగులు వేస్తే నోరుమెదపని అధికారులు... తెదేపా ప్లెక్సీలను అనుమతి లేదంటూ తొలగించటం ఏంటని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు అన్న సంగతి అధికారులు గుర్తుంచుకోవాలని కళా వెంకట్రావు హెచ్చరించారు.
ఇవీ చదవండి