భారత 48 ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ నేడు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకార మహోత్సవం జరగనుంది. సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణతో రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్... ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కొద్దిసంఖ్యలోనే అతిథులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్రమంత్రులు, న్యాయశాఖ ఉన్నతాధికారులతో పాటు జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది.
నేటి నుంచి 2022 ఆగస్టు 26 వరకు అంటే 16 నెలల పాటు సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నిలిచారు. 1966- 67 లో జస్టిస్ కోకో సుబ్బారావు సీజేఐ పనిచేశారు. అర్ద శతాబ్దం తర్వాత మళ్లీ తెలుగు వ్యక్తి అత్యున్నత న్యాయం పీఠం ఎక్కబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. 1983లో న్యాయవాదిగా నల్లకోటు వేసుకున్న జస్టిస్ రమణ.. 2000 సంవత్సరంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా.. ఆ తర్వాత దిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరిలో సర్వోన్నత న్యాయస్థానానికి పదోన్నతి పొందారు.