ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామిని నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గోస్వామి విధులు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత ఏపీ ఉన్నత న్యాయస్థానం సీజే జస్టిస్ జె.కె.మహేశ్వరిని సిక్కింకు బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఇదీ నూతన సీజే ప్రస్థానం
జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి.. న్యాయకోవిదుడు మాత్రమే కాదు. మంచి క్రికెటర్‌గా గుర్తింపు పొందారు. గువాహటి హైకోర్టు నుంచి వెలువడే ద్వైవార్షిక బులెటిన్ అయిన 'ఆత్మన్'కు కొద్దికాలం పాటు సంపాదకుడిగా కూడా వ్యవహరించారు. 1961 మార్చి 11న అసోం రాష్ట్రంలోని జోర్హాట్‌లో పుట్టిన ఆయన.. రంజీట్రోఫీలో అసోం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. సీనియర్ స్థాయిలో తూర్పు మండలానికి అండర్-19, అండర్-22 జట్ల తరఫున ఆడారు. 1985లో న్యాయవాద పట్టా పొందిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన హైకోర్టులో న్యాయమూర్తి అయ్యారు. 2019లో సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే ముందు కొన్నాళ్ల పాటు గువాహటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.