ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 23, 2019, 6:48 PM IST

Updated : Oct 23, 2019, 11:51 PM IST

ETV Bharat / city

'కేసులున్న వ్యక్తులు రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారు?'

వ్యక్తిగత లబ్ధికోసం తాను ఎప్పుడు పాకులాడనన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్... పాతికేళ్ల ప్రయాణం ఆలోచించే పార్టీ పెట్టానని పునరుద్ఘాటించారు. ప్రభుత్వాన్ని నడిపేవారు హింసను ప్రోత్సహించకూడదని హితవు పలికారు. సీబీఐ కేసులు ఉన్న వ్యక్తులు రాష్ట్రప్రయోజనాలపై రాజీపడతారన్నారు. రాష్ట్ర ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతుందని ఆరోపించారు. ఉపాధి కోల్పోయిన వారి కోసం వచ్చే నెల 3న ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు.  అసెంబ్లీలో గట్టిగా మాట్లాడితే కొడతామన్న తీరుగా వైకాపా ప్రవర్తిస్తుందని ధ్వజమెత్తారు.

'కేసులున్న వ్యక్తులు రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారు?'

'కేసులున్న వ్యక్తులు రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారు?'

ప్రకాశం జిల్లా నుంచి వచ్చి జనసేన పార్టీ శ్రేణులతో పవన్‌ కల్యాణ్‌ మంగళగిరిలో సమావేశమయ్యారు. వారి చెప్పిన అంశాలు శ్రద్ధగా విన్న ఆయన.. అన్ని విషయాలు గమనించే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. పదవులు, అధికారంపై ఆశ లేకుండా పాతికేళ్లు తనతో ప్రయాణానికి సిద్ధం కావాలని సూచించారు. నీతి, నిజాయతీ ఉండే రాజకీయ నాయకులు రావాలని అభిప్రాయపడ్డారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పార్టీని నడుపుతానని పునరుద్ఘాటించారు. మానవత్వం కోసం పరితపించే ఎవరినైనా అభిమానిస్తానని పవన్‌ తెలిపారు. పార్టీల కోసం దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టకూడదన్న ఆయన... జగన్‌, చంద్రబాబుతో తనకు వ్యక్తిగత విభేదాల్లేవని స్పష్టం చేశారు.

అధికారం ఇస్తే అధికారులపై దాడులా ?

విశాఖలో జరిగిన కోడికత్తి కేసు ఏమైందని జగన్‌ను ప్రశ్నించారు. చిన్నాన్న హత్యకు గురైతే ఇప్పటికీ ఏమీ తేల్చలేక పోయారని ఎద్దేవా చేశారు. వివేకా హత్యలో ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న జగన్... అధికారంలోకి వచ్చాక వివేకా హత్య కేసును సీబీఐకి ఎందుకు అప్పగించాలేదని నిలదీశారు. విచారణలో పురోగతి ఏదని అడిగారు. నెల్లూరులో మహిళా అధికారి ఇంటిపై ఎమ్మెల్యే దాడి చేశారన్న పవన్‌... ప్రభుత్వం నడిపేవారు హింస ప్రోత్సహించకూడదని హితవు పలికారు.

151 సీట్లు ఇస్తే... కొడతారా?

కేసులు ఉండేవాళ్లు సమాజంలో బలంగా మాట్లాడలేరన్న పవన్‌.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడతారని వ్యాఖ్యానించారు. జగన్‌ దిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రాజెక్టులపై బలంగా మాట్లాడలేకపోయారని విమర్శించారు. సీఎం జగన్‌కు సీబీఐ కేసుల భయం ఉందన్న జనసేనాని... 151 సీట్లు ఇస్తే ప్రజాభిమానాన్ని పలుచన చేశారన్నారు. వైకాపాకు ఓట్లేసి తప్పుచేశామా అనే భావన జనంలో కలుగుతుందని తెలియజేశారు. అసెంబ్లీలో చర్చ జరగడం లేదన్న కల్యాణ్‌.. మాట్లాడితే కొడతారేమో అన్న దుస్థితి ఉందని విశ్లేషించారు.

విశాఖలో జనసేన ర్యాలీ

కోట్లు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలిచివారు రాష్ట్రాభివృద్ధి గురించి ఎందుకు ఆలోచిస్తారని సందేహించారు. ప్రజాప్రతినిధులు వాటాల కోసం పీడిస్తే రాష్ట్రానికి పెట్టుబడుదారులు ఎలా వస్తారని దుయ్యబట్టారు. యువతకు ఉపాధి కల్పించే కంపెనీలు రాష్ట్రానికి రావడంలేదన్న పవన్... ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్ రహితం కావాలని ఆకాంక్షించారు. వైకాపా అధికారంలోకి వస్తే కన్నీరు కార్చే పరిస్థితి ఉండదన్నారని... ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇసుక కొరతతో లక్షల మంది ఉపాధి కోల్పోయారని పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ ప్రభుత్వం వచ్చాక ఇసుక మాఫియా మరింత పెరిగిందని ఆరోపించారు. రాష్ట్ర ఇసుక బెంగళూరు, హైదరాబాద్‌లో దొరుకుతోందన్నారు. భవననిర్మాణ కార్మికుల కోసం విశాఖలో వచ్చేనెల 3న జనసేన లాంగ్ మార్చ్ నిర్వహిస్తోందని తెలిపారు.

ఇదీ చదవండి :

కాలువలు కళకళలాడాలి : సీఎం

Last Updated : Oct 23, 2019, 11:51 PM IST

ABOUT THE AUTHOR

...view details