రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు(pawan kalyan fires on YCP Government over floods). రాష్ట్రంలో వరదల భీభత్సంతో ప్రజల ఇళ్లు, పశువులు, పంటలు కొట్టుకుపోతున్నాయని.. ప్రాణాలు కోల్పోతున్నారని.. పొలాల్లో ఇసుకమేటలు చూసి రైతులు ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ఇసుక అమ్ముతాం అని ప్రకటనలు ఇవ్వటమేంటన్న జనసేనాని.. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగితజ్ఞానం ఉందా..? అని ప్రశ్నించారు.
'రాష్ట్రంలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ప్రజల ఇళ్లు, పశువులు, పంటలు కొట్టుకుపోతున్నాయి. పొలాల్లో ఇసుక మేటలు చూసి రైతులు ఏడుస్తున్నారు. ప్రభుత్వం ఇసుక అమ్ముతాం అని ప్రకటనలు ఇస్తోంది. ఈ ప్రభుత్వానికి ఇంగితజ్ఞానం ఉందా..?' - పవన్‌కల్యాణ్, జనసేన అధినేత
జల ప్రళయంతో చేతికొచ్చిన పంటలు కోల్పోయి.. రైతన్నలు బాధలో ఉంటే ఇసుకపై వ్యాపార ప్రకటనలు ఏమిటి..? అని ఆ పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. వరదలతో జనం.. సాయం కోసం ఎదురుచూస్తుంటే ప్రచారం కావాల్సి వచ్చిందా..? నీరో తత్వం ఒంటబట్టిందా? అని ట్విటర్ వేదికగా నిలదీశారు.