Jal Jeevan Mission Project in AP: రాష్ట్రంలో జలజీవన్ మిషన్ ప్రాజెక్టు కింద పనులు ప్రారంభమై రెండేళ్లవుతున్నా ఇప్పటికీ చాలాచోట్ల పనులే మొదలు కాలేదు. పనులు ప్రారంభించిన చోట మందకొడిగా సాగుతున్నాయి. రాష్ట్రంలో పథకం అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పనుల్లో జాప్యంపై జలశక్తి మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసిందని తెలుస్తోంది. గత రెండేళ్లుగా వాటా నిధులను (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేరో 50శాతం భరించాలి) కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చలేదని రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహరావు అడిగిన ప్రశ్నకు జల్‌శక్తిశాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఈనెల 6న సమాధానమిచ్చారు. 2021-22 సంవత్సరానికి మంజూరు చేసిన గ్రాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం 2022 మార్చిలోగా ఉపయోగించకపోతే మురిగిపోతుందని కూడా ఆయన అన్నట్లు వార్తలొచ్చాయి.
రెండేళ్లలో ఇచ్చిన కనెక్షన్లు 18.47 లక్షలే
పూర్తి చేసిన పనులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, ప్రతిపాదిత పనులు పలు చోట్ల మొదలు కాని కారణంగా గత రెండేళ్లలో కొత్తగా 18,47,116 ఇళ్లకే కుళాయి కనెక్షన్లు ఇవ్వగలిగారు. ప్రణాళిక ప్రకారమైతే ఇప్పటికే 35 లక్షలకుపైగా కనెక్షన్లు ఇవ్వాలి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 95,16,846 గృహాలు ఉన్నాయి. 2019 ఆగస్టు 15న జలజీవన్ మిషన్ ప్రాజెక్టు ప్రారంభమైన నాటికి 30,74,310 (32.30%) ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. గత రెండేళ్లలో ఇచ్చిన వాటితో కలిపి ప్రస్తుతం 49,21,426 (51.71%) ఇళ్లకు నీటి కనెక్షన్లు ఉన్నాయి. వంద శాతం ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చిన జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌లో ఒకటీ లేదు. కనెక్షన్ల జారీలో శ్రీకాకుళం జిల్లా బాగా వెనుకబడింది. ఈ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోగల 6,65,023 గృహాల్లో 1,06,657 (16.04%) కనెక్షన్లు ఇచ్చారు. విశాఖపట్నం, గుంటూరు, విజయనగరం, ప్రకాశం, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ ప్రాజెక్టు పనులు మందకొడిగా సాగుతున్నాయి.