జాతీయ పోర్టుపై కేంద్రమంత్రితో.. మంత్రి గౌతంరెడ్డి చర్చ - it minister gowtham reddy met central minister mansuk mandaveeya
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన జాతీయ పోర్టుపై కేంద్రమంత్రితో చర్చించినట్లు మంత్రి గౌతంరెడ్డి తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం సహా పలు ప్రతిపాదనలు ఇచ్చామని చెప్పారు.

రాష్ట్రంలో దుగరాజపట్నం పోర్టుకు బదులుగా రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల్లో ఏదో ఒక దానిని జాతీయ పోర్టుగా అభివృద్ధి చేయాలని కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయను కోరినట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి గౌతంరెడ్డి తెలిపారు. రెండు రోజుల దిల్లీ పర్యటనలో భాగంగా తొలి రోజు కేంద్ర ఓడరేవుల మంత్రి మనసుఖ్ మాండవీయాను కలిసిన గౌతంరెడ్డి... జాతీయ పోర్టు, బకింగ్ హామ్ కాలువకు సంబంధించిన అంశాలపై వినతిపత్రం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన జాతీయ పోర్టుపై కేంద్రమంత్రితో చర్చించినట్లు గౌతంరెడ్డి తెలిపారు. గతంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీని కలిసిన సమయంలో పోర్టు విషయంపై అడగగా దుగరాజపట్నంకు బదులుగా ప్రత్యామ్నాయ ప్రాంతాలను సూచించాలని కోరినట్లు ఆయన తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం సహా పలు ప్రతిపాదనలు ఇచ్చామని చెప్పారు. అందులో నివేదికల ఆధారంగా రామాయపట్నం సాధ్యాసాధ్యాలకు అనుకూలంగా ఉందని అధికారులు చెప్పినట్లు మంత్రి వివరించారు. దీనిపై త్వరలోనే అంతర్గత సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు గౌతంరెడ్డి తెలిపారు. బకింగ్ హామ్ కాలువలో జలరవాణపై ప్రతిపాదనలు ఇచ్చి జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరినట్లు గౌతంరెడ్డి తెలిపారు.