నెల రోజులుగా సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ మనీలాండరింగ్ కేసులో సినీతారల విచారణ పర్వం కొలిక్కి రావడంతో.. ఈడీ తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆగస్టు 31 నుంచి ఈనెల 22 వరకు సినీ ప్రముఖులను అధికారులు ప్రశ్నించారు. పూరి జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రానా, రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాస్‌తోపాటు నవదీప్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్, ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్‌ను నిధుల మళ్లింపుపై ఎన్ఫోర్సమెంట్ డైరెక్టరేట్ (ENFORCEMENT DIRECTORATE) విచారణ జరిపింది.
ఎలాంటి ఆధారాలు లేవు!
డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ వాంగ్మూలం ఆధారంగా... సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. కెల్విన్‌తో సినీ ప్రముఖులకు... ఆర్థిక లావాదేవీలున్నాయా అనే కోణంలోనే విచారణంతా కొనసాగింది. కెల్విన్, ఇతర నిందితుల బ్యాంకు ఖాతాలతో పాటు... నటుల ఖాతాలనూ పరిశీలించింది. వివిధ బ్యాంకుల నుంచి సమాచారం సేకరించింది. డ్రగ్స్ విక్రయాల ద్వారా లాభాలు ఆర్జించి.. వాటిని ఇతర రూపాల్లోకి మళ్లిస్తేనే మనీలాండరింగ్ (money laundering in tollywood drugs case) నిరోధక చట్టం ప్రకారం నేరం. అయితే డ్రగ్స్ లావాదేవీల్లో సినీతారలు లబ్ధిపొంది మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ విచారణలో ఎలాంటి ఆధారాలు లభించనట్లు సమాచారం. వివిధ మార్గాల్లో మరింత సమాచారం సేకరిస్తున్నామని... వివిధ కోణాల్లో దర్యాప్తు సాగుతోందని ఈడీ వర్గాలు చెబుతున్నాయి.