ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సెప్టెంబరు 5న అంతర్జాతీయ విమాన సంస్థల సదస్సు

గన్నవరం విమానాశ్రయం కేంద్రంగా వచ్చే నెల 5న అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట్ర విమానాశ్రయాల నుంచి దేశీయ, అంతర్జాతీయ కనెక్టివిటీ పెంచేందుకు తొలిసారిగా ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ, దేశీయ విమాన సంస్థలు , పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరవుతారు. కేంద్ర పౌర విమానయానశాఖ, భారత విమానయాన సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

సెప్టెంబరు 5న అంతర్జాతీయ విమానసంస్థల సదస్సు

By

Published : Aug 21, 2019, 10:14 PM IST

సెప్టెంబరు 5న అంతర్జాతీయ విమానసంస్థల సదస్సు

రాష్ట్రంలోని గన్నవరం, తిరుపతి విమానాశ్రయాల నుంచి రాకపోకలు చేసే అంతర్జాతీయ స్థాయి సర్వీసులు అంతంత మాత్రమే. గన్నవరం విమానాశ్రయం ప్రయాణికుల వృద్ధిలో ఏటా గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నా... ఇక్కడి నుంచి సర్వీసులు ప్రారంభించేందుకు విమానయాన సంస్థలు ముందుకు రావడం లేదు. ఈ కారణంతోనే.. రాష్ట్రంలోని విమానాశ్రయాల నుంచి అంతర్జాతీయ నగరాలకు సర్వీసులు పెంచే లక్ష్యంతోనే.. సెప్టెంబరు 5న గన్నవరం విమానాశ్రయం కేంద్రంగా అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నారు.

తిరుపతికి సైతం కేంద్రం.. అంతర్జాతీయ విమానాశ్రయ హోదా ప్రకటించింది. అయినా.. అక్కడి నుంచి ఇతర దేశాలకు సర్వీసులు లేవు. గన్నవరం నుంచీ అంతంతమాత్రమే. వీటితో పాటు రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాలలో ప్రయాణికుల రద్దీని విమానయాన సంస్థలకు తెలియజేయడం ఉద్దేశంగా సెప్టెంబరు 5న సదస్సును ఏర్పాటు చేశారు.

ఏటా 25 లక్షలకు పైగా..

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఏటా 25 లక్షల మందికి పైగా హైదరాబాద్​కు వెళ్లి అక్కడి నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు వినియోగించుకుంటున్నారు. ప్రయాణికుల రద్దీపై ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీయల్ ఫెడరేషన్ పౌర విమానయాన సంస్థకు ఇప్పటికే లేఖ రాసింది. గన్నవరం విమానాశ్రయం నుంచి దేశంలోని దిల్లీ, ముంబయి, చెన్నై , బెంగళూరు, హైదరాబాద్, విశాఖ, కడప, తిరుపతిలకు మాత్రమే సర్వీసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. సెప్టెంబర్ 5 సదస్సు.. ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రముఖ సంస్థలకు ఆహ్వానం

గోవా, అహ్మదాబాద్, జమ్ము-కశ్మీర్, షిరిడీ సహా అనేక నగరాలకు డిమాండ్ ఉన్నా.. ఇక్కడి నుంచి సర్వీసులు నడపడానికి విమానాశ్రయ సంస్థలు ఆసక్తి చూపడం లేదు. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఇండిగో, ట్రూజెట్ సంస్థలు మాత్రమే ఇక్కడి నుంచి సర్వీసులు నడుపుతున్నాయి. విమాన సర్వీసులు పెంచే ఆలోచనలతో ప్రముఖ విమానయాన సంస్థలైన గో-ఎయిర్, విస్టారా, ఎయిర్ ఏషియా విమానయాన సంస్థల ప్రతినిధులను ఈ అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానించనున్నారు.

టూర్ ఆపరేటర్లకు స్వాగతం

రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలను ఆయా సంస్థలప్రతినిధులకు అవగాహన కల్పిస్తే.. భవిష్యత్తులో అనేక నగరాలు, దేశాలకు సర్వీసులను నడిపేందుకు వారు ముందుకొస్తారనేది ప్రణాళిక. దేశంలోని ప్రముఖ టూర్ ఆపరేటర్లను కూడా ఈ సదస్సుకు ఆహ్వానిస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

కానిస్టేబుల్​ను కారుపై 2.5 కి.మీ ఈడ్చుకుంటూ...

ABOUT THE AUTHOR

...view details