Hyderabad Pub Case:హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పుడింగ్ అండ్ మింక్ కేసులో నిందుతులైన అభిషేక్, అనిల్‌కుమార్.. గతంలో చేసిన వ్యాపారాలు, ఉద్యోగాల గురించి పోలీసులు ఆరా తీశారు. ఫిలింనగర్‌లోని సాంచూరీ కేఫ్‌లో అభిషేక్‌కు భాగస్వామ్యం ఉందని తెలుసుకున్నారు. అక్కడికి వస్తున్నవారిలో సంపన్న యువకులు, సినీపరిశ్రమకు చెందినవారిని పరిచయం చేసుకున్న అభిషేక్.. వారిని పబ్‌కు ఆహ్వానించి పార్టీలు ఇచ్చాడని అతడి కాల్‌డేటా ఆధారంగా గుర్తించారు.
కరోనా దెబ్బకు డీలా.. తర్వాత డీజే..:పుడింగ్ అండ్ మింక్ పబ్‌ను ఐదేళ్ల నుంచి నిర్వహిస్తున్న అభిషేక్‌కు కరోనా వైరస్ ప్రభావంతో పబ్బును మూసేయడం.. సిబ్బందికి సగం జీతం ఇవ్వడం వంటివి భారీ నష్టాన్ని కలిగించాయి.. వైరస్ ప్రభావం తగ్గడం.. పబ్బులు.. బార్లకు సర్కారు అనుమతులు ఇవ్వడంతో నష్టాలను పూడ్చుకుని లాభాలబాట పట్టేందుకు పుడింగ్ అండ్ మింక్ పబ్బులో సౌకర్యాలను మరిన్ని పెంచాడు. కొందరు పోలీస్ అధికారులు, ఎక్సైజ్ అధికారుల సహకారంతో అర్ధరాత్రి దాటాక కూడా పబ్బుల్లో పార్టీలు, విందులు, వినోదాలు ఏర్పాటుచేశాడు. ఈ క్రమంలోనే కొకైన్, ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్‌ను తన స్నేహితులు, సన్నిహితులకు సరఫరా చేసేవాడు. కొవిడ్ నిబంధనలు సడిలించిన నాలుగైదు నెలల్లోనే పబ్బు లాభాలబాట పట్టింది. అర్ధరాత్రి దాటాక కూడా మద్యం లభిస్తుందన్న ప్రచారాన్ని సోషల్ సర్కిల్‌లో ప్రచారం చేయడం, "పామ్" యాప్‌ను డౌన్‌లోడ్ చేయించడంతో రోజూ వందలమంది యువత పబ్‌కు రావడం మొదలైంది. డ్రగ్స్ కూడా సరఫరా చేయటం వల్ల రోజుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల లాభం వస్తున్నట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు.
పోలీసులే కొకైన్ కొన్నారు..: పబ్‌లో కొకైన్ విక్రయిస్తున్నారన్న సమాచారాన్ని నిర్ధరించుకునేందుకు, అక్కడ కొకైన్ తీసుకుంటున్నవారిని గుర్తించేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. మార్చి తొలివారం నుంచి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించినట్టు సమాచారం. ఇందుకోసం శిక్షణ పూర్తై కొత్తగా విధుల్లో చేరిన నలుగురు ఎస్సైలు, ముగ్గురు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రతి శనివారం పబ్‌కు వెళ్లేవారు. రహస్య కెమెరాలతో అక్కడి దృశ్యాలను చిత్రీకరించారు. రహస్యంగా కొకైన్ లభిస్తోందని తెలుసుకున్నాక.. తమకూ కొకైన్ కావాలని అక్కడున్న వారికి కోరారు. తొలుత లేదని చెప్పినా.. తర్వాత గ్రాము రూ.8 వేలకు ఇస్తామంటూ చెప్పగా... 0.05 గ్రాము కొకైన్‌ను కొన్నారని విశ్వసనీయంగా తెలిసింది. కొకైన్ కొన్నతీరును చిత్రీకరించిన పోలీసులు ఆ దృశ్యాలను ఉన్నతాధికారులకు చూపించారు.