ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BLAST: దర్భంగా పేలుడు.. తీగ లాగితే హైదరాబాద్​లో కదిలిన డొంక!

ఇండియన్ ముజాహిదీన్‌ మళ్లీ క్రియాశీలకంగా మారేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్భంగా పేలుడు దర్యాప్తులో భాగంగా వెల్లడవుతున్న విషయాలను బట్టి అధికారులు ఆ నిర్ధారణకు వస్తున్నారు. దర్భంగా పేలుడు ఘటనతో హైదరాబాద్‌కు సంబంధాలు ఉండటంతో పోలీసు శాఖ చురుగ్గా దర్యాప్తు జరుపుతోంది. పేలుడుకు కారణమైన రసాయనం ఎవరు సమకూర్చారు. దర్భంగాకు పంపిన ఇద్దరు ఉత్తరప్రదేశ్ వాసులైన ఇమ్రాన్ మలిక్, నాసిర్ మలిక్‌కు స్థానికంగా ఎవరు సహకరించారన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

indian-muzahiddin
indian-muzahiddin

By

Published : Jun 30, 2021, 7:12 AM IST

ఈనెల 17న దర్భంగా రైల్వే స్టేషన్‌లోని పార్సిల్‌లో చిన్నపాటి పేలుడు.. తీగ లాగితే భాగ్యనగరం వద్ద డొంక కదిలింది. సికింద్రాబాద్‌ రైల్వే పార్సిల్‌ వద్ద బుక్‌ చేసిన ఆసిఫ్ నగర్‌కు చెందిన ఇమ్రాన్, నాసిర్‌లను ఎన్​ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో వెల్లడవుతున్న అంశాలు అధికారులనూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. అందులో మొదటిది పేలుడుకు కారణమైన రసాయనం. మూడు అంగులాల సీసాలో ఉన్న రసాయనం ఏమిటనేది ఫోరెన్సిక్ నిపుణులూ చెప్పలేకపోతున్నారు. ఇది ప్రమాదకరమైందని భావిస్తున్నారు.

దేశంలో వరుస పేలుళ్లు, వందలాదిమంది మరణానికి కారణమైన ఉగ్రవాదసంస్థ ఇండియన్‌ ముజాహిద్దీన్‌కు దర్భంగా కేంద్రస్థానం లాంటిది. కర్ణాటకకు చెందిన యాసిన్ భత్కల్ ఇక్కడి నుంచే దేశవ్యాప్త పేలుళ్లకు కుట్రపన్నాడు. దీన్నే దర్భంగా మాడ్యుల్‌గా పిలుస్తారు. 2007, 2013లో హైదరాబాద్‌లో జరిగిన లుంబినీ పార్క్, గోకుల్ ఛాట్, దిల్‌సుఖ్ నగర్ పేలుళ్లు అందులో ఉన్నాయి. యాసిన్ భత్కల్‌కు దర్భంగా జిల్లా చాక్‌జోరాకు చెందిన డానిష్ అన్సారీ ఆశ్రయమిచ్చాడు. దర్భంగాకే చెందిన ఫసీ ఈ ఉగ్ర సంస్థకు నిధులు సమకూర్చాడు. తదనంతర కాలంలో దర్భంగా జిల్లాలో ఐఎంకు చెందిన 14 మందిని ఎన్​ఐఏ అరెస్టు చేసింది.

నలుగురు అరెస్ట్​

2013లో నేపాల్ సరిహద్దుల్లో యాసిన్ భత్కల్ అరెస్టయ్యే వరకూ దేశంలో ఇండియన్‌ ముజాహిదీన్​ నరమేథం కొనసాగింది. అప్పటి నుంచి కొంత ప్రశాంత పరిస్థితులే నెలకొన్నాయి. ఇప్పుడు అకస్మాత్తుగా దర్భంగాలో చోటుచేసుకున్న పేలుడు యంత్రాంగాన్ని ఉలికిపాటుకు గురిచేస్తోంది. ఆ కేసును తీవ్రంగా పరిగణిస్తున్న అధికారులు ఇప్పటికే కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరిని, హైదరాబాద్​లో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

ఆరా తీస్తున్న పోలీసులు

ఉగ్రమూక కదలికలపై తెలంగాణ పోలీసులు సైతం ఆరా తీస్తున్నారు. కొంతకాలంగా ఆసిఫ్‌నగర్​లో ఉంటున్న ఉత్తరప్రదేశ్ వాసులైన ఇమ్రాన్ మలిక్, నాసిర్ మలిక్‌ కదలికలపై కన్నేశారు. వీరు నిజంగా ఉపాధి కోసమే వచ్చారా? ఇంకేమైనా కారణం ఉందా? అనే కోణంలోనూ దృష్టి సారించారు. ఎన్.ఐ.ఎ. అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. నాసిర్ మలిక్ రెండుసార్లు పాకిస్థాన్‌కు వెళ్లి వచ్చినట్లు పోలీసులు నిర్ధరణకు వచ్చారు. ప్రస్తుతం తమ అదుపులో ఉన్న నిందితులను ఎన్​ఐఏ అధికారులు దిల్లీలో విచారిస్తున్నారు.

ఇదీ చదవండి:

AP Cabinet: ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ABOUT THE AUTHOR

...view details