హైదరాబాద్ మెట్రో తొలి దశ పాతబస్తీ మినహా 69.2 కి.మీ. మార్గం గత ఆర్థిక సంవత్సరంలో పూర్తయింది. కారిడార్-1 మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ (29.55 కి.మీ.), కారిడార్-2 జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్(10.65 కి.మీ.), కారిడార్-3 నాగోల్ నుంచి రాయదుర్గం(29 కి.మీ.) మార్గాలను 2017 నవంబరు 29 నుంచి 2020 ఫిబ్రవరి 8 మధ్య దశలవారీగా ప్రారంభించారు.
రవాణా ఆధారిత అభివృద్ధి(టీవోడీ)లో భాగంగా నాలుగు ప్రాంతాల్లో పంజాగుట్ట, ఎర్రమంజిల్, హైటెక్‌సిటీ, మూసారాంబాగ్‌లో 12.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు వాణిజ్య సముదాయాలను నిర్మించింది. రాయదుర్గంలో 5 లక్షల చ.అ. విస్తీర్ణంలో కార్యాలయ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎల్‌అండ్‌టీ మెట్రో రూ.1626 కోట్లు వ్యయం చేసింది.
లాక్‌డౌన్‌తో మరింత నష్టాలు..
గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.600 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం రూ.వెయ్యి కోట్లు వస్తుందన్న అంచనాలు మొదట్లో ఉండేవి. రోజువారీ ప్రయాణికుల సంఖ్య 4 లక్షలు దాటి 5 లక్షల దిశగా ఉన్న దశలో కొవిడ్-19 పిడుగులా వచ్చి పడింది. సేవలు మార్చి 22 నుంచి నిలిచాయి. 5 నెలలుగా ఆదాయం లేదు. కొవిడ్‌కు ముందు నెల వరకు రూ.50 కోట్ల ఆదాయంతో లాభనష్టాలు లేని దశకు చేరుకుంది. మెట్రోరైళ్లు, స్టేషన్ల నిర్వహణ, సిబ్బంది జీతాల వరకు ఇబ్బంది లేకుండా గడిచిపోయేది. కరోనాతో అధికారుల అంచనాలకు తోడు.. ఈ లెక్కలన్నీ తలకిందులయ్యాయి.