Omicron BA.4 case: దక్షిణాఫ్రికా.. తదితర దేశాల్లో కొవిడ్ కేసుల ఉద్ధృతికి కారణమైన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ‘బీఏ.4’... భారత్‌లోనూ వెలుగు చూసింది! ఈ వేరియంట్ తొలికేసు ఈనెల 9న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నమోదైంది. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన ఓ వైద్యుడికి ఈ వెరియంట్ సోకినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇండియన్ సార్స్ కొవ్-2 కన్షార్షియం ఆన్ జీనోమిక్స్ (ఇన్సాకాగ్) వెల్లడించింది. దేశంలోని మరిన్ని నగరాల్లో ఈ సబ్ వేరియంట్ కేసులు నమోదయ్యే అవకాశముందని భారత వైద్య పరిశోధన మండలి శాస్త్రవేత్త ఒకరు అభిప్రాయపడ్డారు.
దీని తీవ్రత ఎలా ఉండొచ్చు..?
దక్షిణాఫ్రికాలో కొవిడ్ ఉద్ధృతికి కారణమైన రెండు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లలో ‘బీఏ.4’ కూడా ఒకటి. ఇంతకుముందు కొవిడ్‌కు గురైన, రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఇది సోకుతున్నట్టు ఇప్పటికే నిర్ధారణ అయింది. ఒమిక్రాన్ వేరియంట్ కంటే ఇది ప్రమాదకారి కాదనీ.. కాకపోతే వీటి వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక విభాగం చీఫ్ మారియా వాన్ కెర్ఖోవ్ పేర్కొన్నారు.