Red Alert in Telangana : బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో.. జన జీవనం స్తంభించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెరడిగొండ మండలం రాజులతాండాకు వెళ్లే మార్గంలో ఉప్పొంగుతున్న వాగును ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో దాటుతున్నారు. దర్బాతండా మార్గంలో వాగు దాటే క్రమంలో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు కొంతదూరం కొట్టుకుపోయి చెట్లకొమ్మల సాయంతో బతికి బయటపడ్డారు. బోథ్ మండలం మర్లపల్లికి వెళ్లే దారిలోనూ ప్రజలు వాగు దాటేందుకు కష్టాలు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో తుంతుంగా వాగు ప్రవాహంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Red Alert in Northern Telangana : ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా పొంగిపొర్లుతున్న వాగులతో ఏజెన్సీలో రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్-పలిమెల మండలాలను కలిపే పెద్దంపేట వాగు వంతెన వద్ద రహదారి తెగి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. వాగులో విద్యుత్తు స్తంభాలు కొట్టుకుపోయి మండల వ్యాప్తంగా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. మహాముత్తారం మండలం యత్నారం గ్రామస్థులు.. వరద భయంతో అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడే డేరాలు వేసుకున్నారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బల్లకట్టువాగు, కుక్కతోగు, జిన్నెలవాగుల ఉద్ధృతితో.. భద్రాచలం-వెంకటాపురం ప్రధాన రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో ఇద్దరు గర్భిణులను పడవల్లో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లే వీలులేక మరో మహిళ ఇంటి వద్దే ప్రసవించటంతో.. అతికష్టం మీద వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకొని చికిత్స అందించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వెలబెల్లికి చెందిన గర్భిణినీ.. వరద నీటిలోనే ట్రాక్టర్లో ఆస్పత్రికి తరలించారు.
దెబ్బతిన్న కాలువలు.. : వర్షాల కారణంగా రాష్ట్రంలో రెండుచోట్ల సాగునీటి కాల్వలకు గండ్లు పడ్డాయి. ములుగు జిల్లాలో రెండుచోట్ల కాల్వలు దెబ్బతిన్నాయి. 21 చోట్ల చెరువులు, సంబంధిత నిర్మాణాలకు గండ్లు పడ్డాయి. 9 చోట్ల చెరువు కట్టలు, 6 చోట్ల చెరువులకు సంబంధించిన కాల్వలు దెబ్బతిన్నాయి. మూడుచోట్ల తూములు, మరో మూడు చెరువులకు సంబంధించిన కట్ట, తూములకు గండ్లుపడ్డాయని సర్కారు తెలిపింది.