'నిండు గర్భిణిని అయిన నేను సాధారణ వైద్య పరీక్షలకు తరచూ కోఠి ప్రసూతి ఆసుపత్రికి వెళ్లేదాన్ని. ఓ రోజు కొద్దిగా జ్వరం ఉండటంతో భర్తతో కలిసి ఆసుపత్రికి వెళ్లాను. వైద్యులు కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేశారు. 2 రోజుల తర్వాత పాజిటివ్ అని చెప్పారు. మిన్ను విరిగి మీద పడినట్లనిపించింది. గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు తొలిరోజు నుంచి నాకు ధైర్యాన్నిచ్చారు. గర్భిణిని కావటంతో సమస్య తీవ్రమైంది. ఊపిరాడలేదు. తప్పనిసరై వైద్యులు శస్త్రచికిత్స చేశారు. పాపని ప్రత్యేక వార్డుకి మార్చి... నన్ను ఐసీయూలో ఉంచారు. భర్తను పీపీఈ కిట్లు ధరించి తోడున్నారు. వైద్యులు సొంత మనిషిలా చూశారు. రోగనిరోధక శక్తి పెంచుకోవాలని సూచించారు. 20 రోజులపాటు అక్కడే ఉన్నా. పౌష్టికాహారం, సమయానికి మందులు తీసుకున్నా. పూర్తిగా కోలుకుని ఇంటికొచ్చాను. పాప, నేనూ ఆరోగ్యంగా ఉన్నాం.'
- హైదరాబాద్ మల్లాపూర్ ప్రాంతానికి చెందిన మహిళ
ఇంట్లో ఉండే కోలుకున్నా...
కరోనా అనగానే.. పక్కవాళ్లు ఏమనుకుంటారోననే అందరూ భయపడుతున్నారు. నాకూ మొదట అదే భయం ఉండేది. లాక్‌డౌన్ మొదలు నుంచి విరామం లేకుండా పనిచేశాం. మా పరిధిలో ఎక్కువ మంది వలసకూలీలు ఉండటంతో నిత్యం వందలాది మంది వచ్చేవారు. మాస్కు, శానిటైజర్‌తోపాటు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ, మా సిబ్బందిలోనే 26 మందికి పాజిటివ్ వచ్చింది. నా పరీక్ష ఫలితాలు వచ్చిన వెంటనే భార్య, పిల్లలకి నెగిటివ్ రావడంతో వేరే ఇంటికి పంపించాను. ఒళ్లునొప్పులు మినహా పెద్దగా లక్షణాలేం లేకపోవడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నాను. మా 26మందికి ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాం. అన్ని విషయాలు పంచుకునేవాళ్లం. 17 రోజుల పాటు వంటింటి చిట్కాలతో పాటు పౌష్టికాహారం తీసుకున్నాను. రోజూ డ్రైఫ్రూట్స్, పండ్లు తీసుకున్నాను. రోజుకు మూడుసార్లు పసుపు, వేడినీటితో ఆవిరి పట్టాను. తరచూ అల్లం, పసుపుతో మరిగించిన వేడినీరు తాగాను. పూర్తిగా కోలుకుని విధుల్లో చేరాను.
- అడ్మిన్ ఎస్సై
15 రోజుల్లో కోలుకున్నా...
నేను చాలా ఏళ్లు మహారాష్ట్రలో వైద్యాధికారిగా పనిచేశాను. కరోనా గురించి తెలిసిన సమయంలో వృద్ధులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని విన్నాను. భయమేసింది. పరీక్షల్లో నాకు పాజిటివ్ అని తెలిసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 15 రోజులు ఇక్కడ సొంత మనుషుల్లా చూసుకున్నారు. దగ్గరుండి అన్నం తినిపించారు. సపర్యలు చేశారు. కోలుకుంటాననుకోలేదు.. ఇప్పుడు ఇంటికి వెళ్తుంటే సంతోషంగా ఉంది.