హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్(Huzurabad by election 2021) ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 76.26 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ సరళిని సీఈవో శశాంక్ గోయల్ పరిశీలించారు. బుద్ధభవన్ నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించారు.కరోనా నిబంధనల నడుమ పోలింగ్ ముసిగింది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని వసతులు కల్పించారు. పోలింగ్ కేంద్రాల ఆవరణలో హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు.
భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ కమలాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమలాపూర్‌లోని పోలింగ్ కేంద్రం 262లో ఓటేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్..... సాయంత్రం 7 గంటల వరకు జరిగింది. పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. వీణవంకలో ఓటర్లు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పోలింగ్ సెంటర్ వద్దకు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. కరోనా జాగ్రత్తలతో పోలింగ్(Huzurabad by election 2021) జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్కంఠ రేకెత్తిస్తున్న హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు నవంబర్ 2న జరగనుంది.
హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad by elections 2021) కొనసాగుతోంది. కాగా పలు చోట్ల ఆందోళనలు జరిగాయి. నియోజకవర్గంలోని వీణవంక మండలంలో పలుచోట్ల అధికార తెరాస, భాజపా శ్రేణుల మధ్య వాగ్వాదాలు జరిగాయి. గులాబీ పార్టీ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ కమలం పార్టీ నాయకులు ఆందోళనలకు దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు... పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు.
చల్లూరులో వాగ్వాదం
వీణవంక మండలం చల్లూరులో భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మార్కెట్ ఛైర్మన్ బాలకిషన్‌రావు ఇంట్లో డబ్బులు పంచుతున్నారని భాజపా నేతలు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో చల్లూరులో భాజపా, తెరాస శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది.