ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అలా 30 ఏళ్లు గడిచాయి.. భూమి పరిహారం కోసం 86 ఏళ్ల వృద్ధుడి పడిగాపులు! - ఏపీ తాజా వార్తలు

ఒక రైతు రుణం తీసుకుంటేనే వెంటపడి వేధించి వసూలు చేస్తారు అధికారులు... లేదంటే ఉన్న పొలాన్నో, ఇంటినో జప్తు చేస్తామని బెదిరిస్తారు... భయపెడతారు... లాక్కుంటారు... కానీ అదే రైతు భూమిని ప్రభుత్వ అవసరాల కోసం తీసుకుంటే... మాత్రం పరిహారం ఎప్పుడు చెల్లిస్తారో తెలియదు... అసలు ఇస్తారో లేదో కూడా అనుమానమే... ఏళ్లు గడిచినా అడిగే నాధుడు లేరు... ఇలా ఓ వృద్ధుడు తన భూమిపై వచ్చే పరిహారం కోసం ఒకటి కాదు... రెండు కాదు... 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు... అధికారులు మాత్రం ధర్మాసనం చెప్పినా లెక్క చేయలేదు... చివరికి వ్యవహారం హెచ్​ఆర్​సీకి చేరింది.

compensation to old man
వృద్ధుడికి పరిహారం చెల్లించాలని హెచ్​ఆర్​సీ అదేశాలు

By

Published : Apr 30, 2022, 7:16 AM IST

చెక్‌ డ్యాం కోసం వ్యక్తి భూమి తీసుకున్నారు... ప్రభుత్వ భూమి అంటూ ఇబ్బంది పెట్టారు... ఆలా 30 ఏళ్లు గడిచాయి... హైకోర్టులో కేసుతో కొలిక్కి వచ్చింది... 2019లో రూ.2.40 కోట్లు పరిహారంగా ధర్మాసనం నిర్ణయించింది... అయినా ఇప్పటికీ చెల్లించడం లేదు... విసిగిపోయిన ఆ బాధితుడు హెచ్​ఆర్​సీని ఆశ్రయించాడు... '84 ఏళ్ల వృద్ధుడిని ఇంత ఇబ్బంది పెడతారా?... పరిహారం చెల్లించండి.. లేకుంటే హాజరవండి...' ఆర్థిక, జలవనరుల రాష్ట్ర ఉన్నతాధికారులకు హెచ్చార్సీ ఆదేశాలు జారీ చేసింది...

ఆయన 84 ఏళ్ల వృద్ధుడు. పేరు ఎం.జె.ఎస్‌.రాజు. కర్నూలు జిల్లా (ప్రస్తుత నంద్యాల జిల్లా) జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామస్థుడు. ఆర్టీసీలో పనిచేసి పదవీవిరమణ చేశారు. ఆయన కుటుంబానికి చెందిన 31 ఎకరాల భూమిని 1993లో అప్పటి జిల్లా కలెక్టరు స్వాధీనం చేసుకుని నంద్యాలలోని చిన్ననీటిపారుదలశాఖ అధికారులకు అప్పచెప్పారు. అప్పటి నుంచి ఆ భూమికి పరిహారం ఇవ్వలేదు. కొన్నాళ్లు అది ప్రభుత్వభూమి అని అధికారులు వాదించారు. న్యాయస్థానం వారి సొంత భూమి అని తేల్చి పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అయినా ఇవ్వలేదు. చివరికి ఆయన రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ)ని ఆశ్రయించారు. ‘ఒక వృద్ధుడు 30 ఏళ్లుగా తిరుగుతూనే ఉన్నారు. ఆయనకు పరిహారం ఇంకా అందలేదు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. మే 4 లోగా పరిహారం చెల్లించండి. లేదా మే 5న కమిషన్‌ ముందు హాజరవండి’ అంటూ రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి హెచ్చార్సీ ఆదేశాలిచ్చింది.

ఏళ్ల తరబడి ఎక్కే మెట్టు.. దిగే మెట్టు:ప్రభుత్వం 31 ఎకరాల భూమి స్వాధీనం చేసుకుని కనీసం తన భూమిగా కూడా గుర్తించలేదని రాజు చెప్పారు. తొలుత భూమి హక్కుల కోసమే పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు పరిహారం కోసం మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నానని ఎం.జె.ఎస్‌.రాజు ‘ఈనాడు’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

1993లో పారుమంచాల సమీపంలో చెక్‌డ్యాం నిర్మించాలని చిన్ననీటిపారుదలశాఖ నిర్ణయించింది. దీనివల్ల ఒక స్థాయి వరకు నీరు నిలబడి ఆపై అదనంగా వచ్చే నీరు దిగువకు వెళ్లిపోతుంది. నిల్వ ఉన్న నీటిని సమీపంలోని 104 ఎకరాల ఆయకట్టు రైతులకు ఇవ్వాలని నిర్ణయించారు. అప్పటి కలెక్టరు వీరి ఆధీనంలో ఉన్న 31 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ విషయం వీరికి చెప్పలేదు. ఆ భూమిని చిన్ననీటిపారుదలశాఖకు ఇచ్చేశారు. 1994లో ఆనకట్ట కట్టేశారు. ఆ భూములు తీసుకుంటున్నట్లు 1998లో గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇస్తూ ఆ భూములు రాజు, వారి సోదరుల పేరున ఉన్నాయని అందులో పేర్కొన్నారు. పదే పదే కలెక్టర్‌ను కలిసి పరిహారం అడిగినా ప్రయోజనం లేకపోవడంతో 2003లో హైకోర్టును ఆశ్రయించారు. అవన్నీ ప్రభుత్వ భూములని అధికారులు వాదించడం, 1998లో ఇచ్చిన గెజిట్‌ను 2004లో రద్దు చేయడంతో హైకోర్టు తొలుత వీరి కేసును డిస్మిస్‌ చేసింది. దాంతో 2013లో మళ్లీ రిట్‌ పిటిషన్‌ దాఖలుచేశారు. అక్కడ ఆ భూములు అర్జీదారుడివేనని తీర్పు వచ్చింది. భూములు తిరిగివ్వాలి.. లేదా పరిహారం చెల్లించాలని హైకోర్టు చెప్పింది.

ఫైలు ఒకరి నుంచి మరొకరికి: దీంతో అప్పటి కలెక్టర్‌, ఆర్డీవోతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. 2019 సెప్టెంబరు 30 వరకు లెక్కించి మొత్తం పరిహారాన్ని రూ.2.40 కోట్లుగా లెక్కించారు.

  • రెవెన్యూ అధికారులు నంద్యాల చిన్ననీటిపారుదల అధికారులకు పంపారు.
  • కర్నూలు ఎస్‌ఈ ద్వారా జలవనరులశాఖ సీఈకి, అక్కడి నుంచి జలవనరులశాఖ కార్యదర్శికి, అక్కడినుంచి 2021 మే 4న ఆర్థికశాఖకు చేరింది.
  • అక్కడ 5 నెలలు పరిశీలించి, మరికొన్ని వివరాలు కావాలంటూ 2021 అక్టోబరు 5న వెనక్కి పంపారు.
  • దీంతో రాజు 2021 అక్టోబరులో రాష్ట్ర హెచ్చార్సీని ఆశ్రయించారు.

మానవహక్కుల కమిషన్‌ ఆదేశాలిచ్చినా: పరిహారం వెంటనే చెల్లించాలని జలవనరులశాఖ ఈఈకి తెలియజేశామని ఆర్డీవో తెలిపారు. ఈ ఫైలు ప్రస్తుతం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి వద్ద పెండింగులో ఉందని ఈఈ చెప్పారు. హెచ్చార్సీ 2021 అక్టోబరులో ఒకసారి, డిసెంబరులో మూడుసార్లు ఈ కేసును విచారించి, పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2022 జనవరి 6న హెచ్చార్సీ మరో ఆదేశం జారీచేసింది. ఏప్రిల్‌ 27 లోపు అర్జీదారుడికి పరిహారం చెల్లించాలని, లేనిపక్షంలో జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి తమ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది. అప్పటికీ పరిహారం చెల్లించలేదు, అధికారులు కమిషన్‌ ముందుకు రాలేదు. దీనికి వేర్వేరు కారణాలు చెప్పారు.

స్పష్టంగా ఆదేశాలు:‘ఒక 84 ఏళ్ల వృద్ధుడు తన భూమికి పరిహారం కోసం 30 ఏళ్లుగా తిరుగుతున్నా అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని భావించడం లేదు. ఇది స్పష్టంగా మానవహక్కుల ఉల్లంఘనే. ఇలాంటి అంశంలో ఒక అధికారి గోదావరి బోర్డు సమావేశానికి వెళ్లడం కన్నా మానవహక్కుల కమిషన్‌ ముందుకు రావడానికే ప్రాధాన్యం ఇవ్వాలని మేం భావిస్తున్నాం. రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సెలవులో ఉంటే ఆ తదుపరి బాధ్యత వహించే ఉన్నతాధికారి హాజరై ఉండాల్సింది’ అని హెచ్చార్సీ అభిప్రాయపడింది. మే 4 లోపు పరిహారం చెల్లించకుంటే ఆ ఇద్దరు అధికారులూ మానవహక్కుల కమిషన్‌ ముందు హాజరుకావాలని తాజా ఆదేశాలు వెలువరించింది. ‘ఆయన భూమికే కాదు.. శారీరకంగా, మానసికంగా 30 ఏళ్ల పాటు ఆయన పడ్డ వేదనకూ కొంత పరిహారం చెల్లించాలి’ అని కమిషన్‌ అభిప్రాయపడింది.

ఇదీ చదవండి: అభివృద్ధిలో పాలుపంచుకునేవారికి ఇచ్చే గౌరవం ఇదేనా?: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details