స్త్రీలు తమ జీవన సరళిలో కొన్ని మార్పులు చేసుకోవటం ఫలితంగా మెరుగైన శారీరక, మానసిక ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని చాలా పరిశోధనల్లో తేలాయి. చిన్నచిన్న దురలవాట్లయినా కానీయండి.. ప్రతికూల ఆలోచనలు కానీయండి.. స్త్రీల ఆరోగ్యంపై దుష్పరిణామాలు చూపుతాయి. పురుషులతో పోల్చితే... స్త్రీల దైనందిన కార్యక్రమాలకు అంతు ఉండదు. అందుకే వారు తమ ఆరోగ్యం, శారీరక ధారుడ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పలు అలవాట్లను తమ జీవితంలో భాగం చేసుకోవాలి. వాటిలో కొన్ని మీ కోసం!
అల్పాహారం తప్పనిసరి: దృఢంగా ఉండటానికి ప్రతిరోజు తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ అవసరం. పోషకాలతో కూడిన అల్పాహారాన్ని తినడం వల్ల దైనందిన కార్యకలాపాలకు అవసరమయ్యే శక్తి లభిస్తుంది. జీవక్రియ మెరుగవుతుంది. పొద్దుటి ఆహారంగా గుడ్లతో పాలకూర లేదా ఆకుకూరలు, కూరగాయలతో చేసినవి తీసుకుంటే మంచిది.
చిరుతిళ్లు అవసరమే:ఆరోగ్యవంతమైన జీవితానికి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ప్రొటిన్ ఫుడ్ తీసుకోవాలి. డైటింగ్ పేరుతో కడుపు మాడ్చుకోకుండా ఆకలైనప్పుడల్లా తినాలి. కొవ్వులున్న, ప్రోటీన్ల చిరుతిళ్లు తింటే మంచిది.
శరీరాకృతి కోసం:స్త్రీలు నిద్రలేచింది మొదలు పడుకునే వరకు అనేక పనులు చేస్తారు. కుటుంబ, వ్యక్తిగత, ఆఫీస్ పనులు చేపేటప్పుడు వీలైనంత వరకు ఎలాంటి మిషన్లపై ఆధారపడకుండా ఉండాలి. ఉదయం ఇంట్లో కూరగాయలు అవసరం.. కాబట్టి నడుచుకుంటూ వెళ్లి తెచ్చుకోవడం ఉత్తమం. ఆఫీస్‌కు వెళ్లినప్పుడు చాలామంది లిఫ్ట్‌లో వెళ్తారు. అలా కాకుండా మొదటి, రెండో ఫ్లోర్‌కు వెళ్లడానికి మెట్లెక్కడం మంచిది. ఇలా చేయడం ఫలితంగా మంచి శరీరాకృతి వస్తుంది.