Holi Celebrations: కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకొనే రంగుల పండుగ హోలీ. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కుటుంబంలో హోలీ పండుగ సంతోషాలను నింపాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. హోలీ ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్వీట్ చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి ప్రసాదించే సహజ రంగులతో హోలీ జరుపుకోవడమే పండుగ పరమార్ధమని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు.
విశాఖలో హోలీ జరుపుకున్న సీఆర్పీఎఫ్ జవాన్లు..
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో చిన్నాపెద్దా రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. జనమంతా వీధుల్లో చేరి శుభాకాంక్షలు చెప్పుకుంటూ సందడి చేశారు. విశాఖ సాగరతీరం రంగులమయమైంది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగ్ దే కార్యక్రమంలో చిన్నా, పెద్దా కలిసి రంగులు చల్లుకున్నారు. విశాఖ జిల్లా పాడేరులోని 234 బెటాలియన్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లు ఉల్లాసంగా హోలీ జరుపుకొన్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. విశాఖ తెదేపా కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. విజయవాడ మార్వాడీ సమాజం, రాజ పురోహిత సంఘం ఆధ్వర్యంలో జరిగిన హోలీ వేడుకల్లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. కర్రలు చేతిలో పట్టుకుని నృత్యం చేశారు. భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు... విజయవాడలోని తన నివాసంలో భాజపా నేతలు, కార్యకర్తలతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు.