పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చిందని... తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య సింగిల్ జడ్జి వద్ద వ్యాఖ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి... ఈ నెల 8న జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ... 6న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎస్ఈసీ దాఖలు చేసిన అప్పీల్పై 7న విచారణ జరిపిన ధర్మాసనం... 8న ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిలుపుదల చేసింది. ఈ వ్యాజ్యంపై లోతైన విచారణ జరిపే విషయాన్ని సింగిల్ జడ్డికి అప్పగించింది. తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది.
ఎస్ఈసీ తరపు న్యాయవాది వివేక్చంద్రశేఖర్ స్పందిస్తూ... తెదేపా నేత వర్ల రామయ్య చేసిన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేశామని వివరించారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల ప్రతిని పరిశీలన నిమిత్తం తమ ముందు ఉంచాలని స్పష్టం చేశారు. పరిషత్ ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించాలని, ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ.. జనసేన పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసిన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీని ఆదేశించారు. ఇదే అంశంపై భాజపా నేత పాతూరి నాగభూషణం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సైతం ప్రస్తుత వ్యాజ్యాలతో జతచేయాలని రిజిస్త్రీని ఆదేశించారు. విచారణను వాయిదా వేశారు.