రాష్ట్ర హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిగింది.
మద్యం, ఇసుక విషయంలో అక్రమాలను నిరోధించేందుకు కొత్త డిపార్ట్మెంట్ 'స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో'ను ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్ఈబీ ఏర్పాటు చట్ట విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 41ను రద్దు చేయాలని వారు కోరారు. ప్రస్తుత చట్టాలు, నిబంధనలను సవరించకుండా... ఎక్సైజ్, పోలీసు శాఖలకు చెందిన అధికారులతో కొత్త శాఖను ఏర్పాటు చేయడానికి వీల్లేదని... హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేస్తూ... మే 9న సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో 41, తదనంతరం జారీ చేసిన జీవోలను రద్దు చేయాలని పిటిషనర్ అభ్యర్థించారు. కౌంటర్ దాఖలు చేసేందుకు అదనపు సమయం కావాలని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోరడంతో... తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేశారు.
- నిధుల మళ్లింపు వ్యవహారం...
ఎస్సీ, ఎస్టీ సబ్ ఫ్లాన్ నిధుల మళ్లింపుపై మాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వరరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నిధుల మళ్లింపుకి సంబంధించి అదనపు సమాచారాన్ని కోర్టుకు సమర్పించాలని పిటిషనర్‌ను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.
- వార్షిక కౌలు చెల్లింపు పై విచారణ....
రాజధాని ప్రాంత రైతుల వార్షిక కౌలు చెల్లింపు అంశంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది ఇంద్రనీల్ బాబు పిల్ దాఖలు చేశారు. వెలగపూడికి చెందిన రైతులు కారుమంచి పకీరయ్య, ఇడుపులపాటి సీతారామయ్య మరో పిటిషన్ వేశారు. కౌలు మొత్తం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. దీనిపై విచారించిన హైకోర్టు...సీఆర్డీఏను కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంటూ.... కేసు విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.
- రైతులను అడగకుండా కొత్త జోన్ ఎలా?
రాజధాని అమరావతి పరిధిలో ఆర్5 జోన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ 335 అమలు నిలిపివేయాని దాఖలైన మరో పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. రైతులు అభ్యంతరాలు స్వీకరించకుండా సీఆర్డీఏ పరిధితో కొత్త జోన్ ఏర్పాటు చేయడం సరికాదని పిటిషనరు తరఫు న్యాయవాది వాదించారు. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోరవడంతో... తదుపరి విచారణ జులై 15కి వాయిదా పడింది.
ఇవీ చదవండి:అచ్చెన్నాయుడు కేసు: కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం