ఒకసారి భూములు అమ్మిన తర్వాత ఆ భూములకు విలువ పెరిగితే.. భూములు కొన్నవారిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిస్తే... చాలా ప్రమాదకర ధోరణికి తావిచ్చినట్లు అవుతుంది. విక్రయదారులంతా తాము అమ్మిన భూములకు విలువ పెరిగాక కొన్నవారిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కోరే అవకాశం ఉంది. అలాంటి కేసులు వరదలా వెల్లువెత్తుతాయి. చట్టం దానికి అనుమతించదు.
ఈ కేసులో వాస్తవాల్ని బట్టి చూస్తుంటే.. ప్రాసిక్యూషన్ కొన్ని చెదురుమదురు ఘటనల్ని గుదిగుచ్చి, ఊహాజనితమైన కుట్ర కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోందని, కథ అల్లాలని చూస్తోందని అర్థమవుతోంది. ఈ కేసును ఏదోలా ఐపీసీ సెక్షన్-120బి పరిధిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. కానీ 120-బి సెక్షన్ వర్తించే నేరం ఏదీ జరగలేదని స్పష్టంగా అర్థమవుతోంది.- హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణం ఎక్కడ జరగనుందన్న సమాచారాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడానికి ముందే... ఆ విషయాన్ని ప్రభుత్వ పెద్దల నుంచి, అధికారుల నుంచి కొందరు వ్యక్తులు తెలుసుకుని మోసపూరితంగా భూములు కొన్నారని, ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని సీఐడీ నమోదు చేసిన కేసును హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ అన్నది స్టాక్ మార్కెట్లో సెక్యూరిటీలు, బాండ్ల క్రయవిక్రయాలకు సంబంధించిన వ్యవహారమని తెలిపింది. భూముల వంటి స్థిరాస్తుల క్రయ విక్రయాలకు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్న భావన, దానికి సంబంధించిన చట్టాలు వర్తించవని స్పష్టం చేసింది. రాజధాని అమరావతి ప్రాంతంలో, దానికి చుట్టుపక్కల జరిగిన భూముల క్రయ విక్రయాలను ఇన్సైడర్ ట్రేడింగ్ అనడానికి గానీ, అక్కడ భూములు కొన్నవారిని ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారన్న పేరుతో ప్రాసిక్యూట్ చేయడానికి గానీ వీల్లేదని స్పష్టం చేసింది. గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో కృష్ణానదికి పక్కన రాజధాని వస్తుందన్న విషయాన్ని 2014 జూన్ 9న ప్రమాణస్వీకారం చేయగానే నాటి ముఖ్యమంత్రి వెల్లడించారని తెలిపింది.
ఆ ప్రాంతంలో రాజధాని వస్తుందన్న విషయం ఈ కేసులో పిటిషనర్లకు, వారికి భూములు అమ్మినవారితో పాటు ప్రపంచం మొత్తానికి తెలుసంది. ‘‘ఈ కేసులో పిటిషనర్లపై ప్రభుత్వం ఊహాజనితమైన క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు ఒడిగట్టిందన్నది నిస్సందేహం. చట్టం దానికి అనుమతించదు. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే పిటిషనర్లను ప్రాసిక్యూట్ చేయడానికి పోలీసులు చీకట్లో బాణం వేశారని నిస్సందేహంగా చెప్పొచ్చు’’ అని తన 87 పేజీల తీర్పులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ పేర్కొన్నారు. ‘‘ఈ దేశ పౌరులుగా ఆస్తులు కొనడం పిటిషనర్లకున్న రాజ్యాంగపరమైన, న్యాయపరమైన హక్కు. దాని ప్రకారమే వారు భూములు కొన్నారు. భూముల యజమానులు కూడా ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగానే, రిజిస్టర్డ్ సేల్‌డీడ్స్ ద్వారానే భూములు అమ్మారు. ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన ఆస్తుల క్రయవిక్రయాలను నేరపూరితంగా చిత్రించడం, పిటిషనర్లకు నేరాన్ని ఆపాదించడం కుదరదు’’ అని స్పష్టం చేశారు.
కేసు నేపథ్యం ఇదీ..
గత ప్రభుత్వంలోని ప్రముఖులతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా రాజధాని సమాచారాన్ని ముందే తెలుసుకున్న కొందరు వ్యక్తులు రాజధానిలో, ఆ చుట్టుపక్కల భూములు కొన్నారని వెలగపూడికి చెందిన సరివేంద్ర సురేష్ అనే వ్యక్తి సీఐడీకి ఫిర్యాదు చేశారు. అక్కడ రాజధాని వస్తుందన్న సమాచారాన్ని భూమి యజమానులకు చెప్పకుండా దాచిపెట్టి భూములు కొని వారు మోసానికి పాల్పడ్డారని, వారు భూములు కొన్న తర్వాత అక్కడ రాజధాని ప్రకటన రావడంతో.. భూముల ధరలు పెరగడం వల్ల లబ్ధి పొందారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ భూముల క్రయవిక్రయాలు, లావాదేవీలతో సురేష్‌కి సంబంధం లేకపోయినా ఆ ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా సీఐడీ పోలీసులు ఐపీసీ సెక్షన్లు 420, 409, 406, 120-బి కింద పలువురిపై కేసులు నమోదు చేశారు.
ఆ కేసులను కొట్టేయాలని కోరుతూ... వెర్టెక్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధీకృత సంతకందారులుగా ఉన్న సీహెచ్ గురు మురళీమోహన్, వి.వెంకటరాయవర్మ, లలిత సూపర్ స్పెషాల్టీస్ ఆసుపత్రి ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ పీవీ రాఘవశర్మ, హైదరాబాద్‌కు చెందిన కిలారు శ్రీహాస, కిలారు రాజేశ్, నార్త్‌ఫేస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరరావు, సీహెచ్ తేజస్వి, గుడ్‌లైఫ్ ఎస్టేట్స్ మేనేజింగ్ పార్టనర్ కె.వెంకటేశ్వర్లు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. వాటిపై ఇదివరకే విచారణ జరిపిన కోర్టు.. తన తీర్పును వాయిదా వేసి, మంగళవారం వెలువరించింది. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. మరికొందరు పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ప్రణతి, గింజుపల్లి సుబ్బారావు, కేఎస్ మూర్తి, పోసాని వెంకటేశ్వర్లు ఏకే కిశోర్‌రెడ్డి, ఎంవీ సుబ్బారెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు.
ఇదో ఆసక్తికరమైన కేసు
‘‘ఇదో విచిత్రమైన, ఆసక్తికరమైన కేసు. బహుశా ఇలాంటి ఆరోపణలతో నమోదు చేసిన మొదటి కేసు ఇదే కావచ్చు. ఆరేళ్ల క్రితం పిటిషనర్లకు, విక్రయదారులకు మధ్య జరిగిన ప్రైవేటు లావాదేవీకి ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో నేరాన్ని ఆపాదిస్తూ... పిటిషనర్లను నేరస్తులుగా పేర్కొంటున్నారు’’ అని ఆ తీర్పులో హైకోర్టు పేర్కొంది. ‘‘ఇన్సైడర్ ట్రేడింగ్‌కి ఐపీసీ సెక్షన్లు వర్తించవు. సెబి చట్టంలోని 12-ఎ, 15-జి సెక్షన్లను పార్లమెంటు ఐపీసీలో చేర్చలేదు. నేర న్యాయ విజ్ఞానశాస్త్రానికి (క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్) ఇన్సైడర్ ట్రేడింగ్ తెలియని విషయం. పిటిషనర్లకు ఇన్సైడర్ ట్రేడింగ్ భావనను వర్తింపజేయడం తప్పుగా ఆలోచించడమే’’ అని కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లను... భారత శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్లు 420 (మోసగించడం), 406 (విశ్వాసఘాతుకానికి పాల్పడినందుకు శిక్ష), 409, 120-బి కింద నేరానికి పాల్పడ్డవారిగా పరిగణించలేమని తెలిపింది. భూములు కొనేటప్పుడు.. భవిష్యత్తులో ఆ భూముల విలువ పెరగడం వల్ల తమకు కలిగే ప్రయోజనాన్ని భూమి యజమానులకు చెప్పాలన్న నిబంధనేదీ లేదని తెలిపింది.