ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేషన్ డీలర్ల కమీషన్ చెల్లింపునకు హైకోర్టు సూచనలు - ఏపీ రేషన్ డీలర్ల కమీషన్ ఇష్యూ

కరోనా సమయంలో నిత్యావసర సరకుల పంపిణీకి రేషన్ డీలర్లకు చెల్లించాల్సిన కమీషన్, బకాయిలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్​పై విచారణ జరిపిన కోర్టు రేషన్ డీలర్లకు, ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. రేషన్ డీలర్లు ఖర్చు చేసిన సొమ్ము వివరాలను అధికారులకు అందించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం పొందిన ఆదాయం వివరాలను ఇవ్వాలని సూచించింది. డీలర్ల అభ్యర్థనలపై నాలుగు వారాల్లో ప్రక్రియ చేపట్టాలని డీఎస్​లను ఆదేశించింది. బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వానికి మూడు నెలల సమయం ఇచ్చింది.

ration dealers
ration dealers

By

Published : Nov 13, 2020, 9:38 PM IST

కరోనా కాలంలో నిత్యావసర సరకులు పంపిణీ చేసిన చౌక ధరల దుకాణదారులకు చెల్లించాల్సిన కమీషన్, బకాయిల విషయంలో డీలర్లకు, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. రేషన్ డీలర్లందరూ ఈ ఏడాది అక్టోబర్ వరకు జిల్లాల వారీగా ఎంత ఖర్చుచేశారో వివరాల్ని పేర్కొంటూ సంబంధిత జిల్లా సరఫరాల అధికారికి 15 రోజుల్లో వ్యక్తిగతంగా అభ్యర్థనలు సమర్పించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం పొందిన సొమ్ము వివరాలను పొందుపరచాలని పేర్కొంది. ఈ ప్రక్రియలో డీలర్లకు సహకారం అందించొచ్చని పిటిషనర్ సంఘానికి సూచించింది.

డీలర్లు వ్యక్తిగతంగా సమర్పించిన అభ్యర్థనలపై నాలుగు వారాల్లో ప్రక్రియ చేపట్టాలని డీఎస్​లను ఆదేశించింది. నాలుగు వారాలు సమయం సరిపడకపోతే మరో రెండు వారాలు తీసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. ఆ తర్వాత బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వానికి మూడు నెలల సమయం ఇచ్చింది. మూడు నెలలు సరిపోకపోతే మరో నాలుగు వారాలు తీసుకోవచ్చంది. కోర్టు ఇచ్చిన నిబంధనలకు డీలర్లు, ప్రభుత్వం కట్టుబడి ఉంటాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొంది. డీలర్ల పరిస్థితి, కరోనా సమయంలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నిధుల కొరతకు దారితీసిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ తరహా ఆదేశాలిస్తునట్లు పేర్కొంది.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.వెంకటరమణ ఇటీవల ఈ మేరకు ఆదేశాలిచ్చారు. కరోనా సమయంలో సరకులు పంపిణీ చేసిన చౌకధరల దుకాణ డీలర్లకు కమీషన్ , బకాయిలు విడుదల చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ చౌక ధరల దుకాణదారుల సంఘాల సంక్షేమ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎం.గిరిజారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరోనా సమయంలో నిత్యావసర సరకుల పంపిణీకి డీలర్లు సొంత సొమ్ము ఖర్చు చేశారన్నారు. డీలర్లకు బీమా కల్పించాలని, ఆరోగ్య కార్డులు జారీ చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి .. సమస్య పరిష్కారానికి హైకోర్టు సూచనలు చేశారు. కరోనా అతలాకుతలం చేస్తున్న సమయంలో ప్రజా పంపిణీ వ్యవస్థకు అవాంతరాలు లేకుండా డీలర్లు సొంతంగా కొంత సొమ్మును ఖర్చు చేశారని గుర్తుచేశారు. ప్రభుత్వ అధికారులు సైతం అసాధారణ పరిస్థితులను తట్టుకొని నిలబడేందుకు శాయశక్తులు కృషిచేస్తున్నారని తెలిపింది.

ఇదీ చదవండి

రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం

ABOUT THE AUTHOR

...view details