విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి మత్తు వైద్య నిపుణుడు డాక్టర్ కె.సుధాకర్ కేసు విషయంలో.. నేరస్థులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు ప్రశ్నించింది. సీబీఐ అభ్యర్ధన మేరకు.. బాధ్యులైన పోలీసు అధికారులను ప్రాసిక్యూట్ చేసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని నిలదీసింది. అంతేకాదు.. ఇలాంటి విషయాల్లో ఏ విధంగా వ్యవహరించాలో తమకు బాగా తెలుసని ఘాటుగా వ్యాఖ్యానించింది.
పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ స్పందిస్తూ.. సీబీఐ కోరుతున్న అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని తెలిపారు. అయితే.. దానికి సంబంధించిన వివరాలను మెమో రూపంలో కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేసిన ధర్మాసనం.. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.
డాక్టర్ సుధాకర్‌పై విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరుపై.. వీడియో క్లిప్పింగులను జతచేస్తూ తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాసిన లేఖను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించి విచారణ జరిపి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ వ్యాజ్యం నేడు హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. దర్యాప్తుపై స్థాయి నివేదికను సీల్డ్ కవర్లో కోర్టు ముందు ఉంచినట్లు సీబీఐ తరపు న్యాయవాది చెన్నకేశవులు కోర్టుకు తెలిపారు. కేసులో ఇప్పటికే అభియోగపత్రం దాఖలు చేసినట్లు వివరించారు. సీబీఐ కోరిన పోలీసు అధికారులను ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే.. తుది అభియోగపత్రం దాఖలు చేస్తామని వెల్లడించారు. పోలీసుల తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని తెలిపారు.
ఇదీ చదవండి:
RRR: ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి: ఎంపీ రఘురామ