ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Black jaggery: నల్లబెల్లం ఉండటం నేరం కాదు.. కానీ..!

Black jaggery: నల్లబెల్లాన్ని వినియోగించి నిబంధనలకు విరుద్ధంగా నాటుసారా తయారు చేసే వారిపై చర్యలు తీసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. నల్లబెల్లం ఉండటం నేరం కాదని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.... స్వాధీనం చేసుకున్న సరుకును విడుదల చేయాలని ఆదేశించింది. పిటిషనర్ నుంచి జప్తు చేసిన రూ.25వేల 250 కిలోల నల్లబెల్లాన్ని విడుదల చేయాలని సెబ్​ అధికారులను ఆదేశిచింది.

High Court
హైకోర్టు

By

Published : Jul 22, 2022, 8:42 AM IST

Black jaggery: నల్లబెల్లం కలిగి ఉండటం నేరం కాదని, దానితో నాటుసారా తయారు చేస్తే చర్యలు తీసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయమై సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులులతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. తన దుకాణం నుంచి 25,250 కేజీల నల్లబెల్లాన్ని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులు సీజ్‌ చేయడాన్ని సవాలు చేస్తూ వాసిరెడ్డి గంగరాజు అనే వ్యాపారి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. నల్లబెల్లం కలిగి ఉండటం, రవాణా చేయడం నేరం కాదని తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. పిటిషనరు నుంచి జప్తు చేసిన నల్లబెల్లాన్ని విడుదల చేయాలని ఎస్‌ఈబీ అధికారులను ఆదేశించారు.

ఆ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు దాఖలు చేసింది. ప్రభుత్వ న్యాయవాది తిరుమలశెట్టి కిరణ్‌ వాదనలు వినిపిస్తూ.. నల్లబెల్లం మానవ వినియోగానికి పనికిరాదని తెలిపారు. జప్తు చేసిన సరకును విడుదల చేస్తే నాటు సారా తయారీకి వినియోగిస్తారని పేర్కొన్నారు. అంతపెద్ద మొత్తంలో సరకును ఎక్కడి నుంచి తెచ్చారో పిటిషనరు చెప్పడం లేదని తెలిపారు. ఆ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. జప్తు చేసిన నల్లబెల్లాన్ని తిరిగి అప్పగించాలని ఆదేశించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details