High court on ration: పాఠశాలల విలీనం పేరుతో 3, 4, 5 తరగతుల విద్యార్థులు మూడు కి.మీ. దూరం వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్న ప్రభుత్వం.. పక్కనే ఉన్న చౌకధరల దుకాణాలను కాదని వాహనాల ద్వారా ఇంటి వద్దే సరకులు ఇస్తామనడంలో హేతుబద్ధత ఏమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. వీలు కుదిరినప్పుడు అరగంట సమయం కేటాయించి కి.మీ. దూరంలోని చౌకధరల దుకాణానికి వెళ్లి రేషన్ సరకులు తెచ్చుకోలేని స్థితిలో పేదలు లేరని తెలిపింది. సరకులు పంపిణీ చేసినందుకు రేషను డీలరుకు ఇచ్చే కమీషన్‌తో పోలిస్తే.. వాహనాల ద్వారా డోర్ డెలివరీ కోసం ప్రజాధనాన్ని భారీగా వినియోగిస్తున్నారని పేర్కొంది. ఈ చర్య ప్రజాధనాన్ని వృథా చేయడం కాదా అని నిలదీసింది. అలా వృథా చేసే సొమ్ముతో పేదప్రజలకు మరిన్ని సరకులు అందించొచ్చని అభిప్రాయపడింది.
సరకుల సరఫరా, చౌకదుకాణాల నిర్వహణకు నిధులిస్తున్న కేంద్ర ప్రభుత్వం నుంచి.. ఇంటింటికీ రేషన్ సరఫరాకు అనుమతి తీసుకున్నారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. న్యాయస్థానం లేవనెత్తిన ప్రశ్నలన్నింటికి వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏ నిబంధనలను అనుసరించి వాహనాల ద్వారా ఇంటింటికీ సరకుల పంపిణీకి సిబ్బందిని నియమించారు? అందుకు ఎలాంటి విధానాన్ని అనుసరించారో చెప్పాలంది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. వాహనాల ద్వారా ఇంటివద్దకే సరకుల సరఫరా పథకాన్ని, అందుకు సంబంధించిన జీవోలను సవాలు చేస్తూ ‘ఏపీ చౌకధరల దుకాణదారుల సంక్షేమ సంఘం’ హైకోర్టులో వ్యాజ్యం వేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.శ్రీనివాస్ వాదనలు వినిపించారు.