ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

120 ఎకరాల్లో రాత్రికి రాత్రే ఎలా తనిఖీ చేశారు?: తెలంగాణ హైకోర్టు - high court on eetala case

తెలంగాణ మాజీ మంత్రి ఈటల భూముల్లో సర్వే జరిపిన తీరును.. ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కనీసం నోటీసులు ఇవ్వకుండా తనిఖీలు చేసి.. సహజ న్యాయసూత్రాలను, చట్టాలను ఉల్లంఘించారని ఉన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. జమున హేచరీస్ భూములు, వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అధికారులు చట్టపరంగా వ్యవహరించవచ్చునని స్వేచ్ఛనిచ్చిన హైకోర్టు.. నోటీసులు ఇచ్చి తగిన సమయం ఇవ్వాలని తెలిపింది.

telangana high court on jamuna hatcheries
జమున హేచరీస్​ కేసులో తెలంగాణ హైకోర్టు

By

Published : May 4, 2021, 8:55 PM IST

భూముల ఆక్రమణ ఆరోపణలపై తెలంగాణ మాజీ మంత్రి ఈటల కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. ఆయన భార్య జమున, కుమారుడు నితిన్ రెడ్డి, జమున హేచరీస్ సంస్థ ఉమ్మడిగా దాఖలు చేసిన అత్యవసర వ్యాజ్యంపై.. జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. తమ వివరణ తీసుకోకుండానే సీఎం విచారణకు ఆదేశించారని పిటిషన్​లో పేర్కొన్నారు. ఈటల కుటుంబం తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్​రెడ్డి వాదించారు. అధికారులు కనీసం నోటీసులు ఇవ్వకుండా చట్టవిరుద్ధంగా సర్వే చేశారని న్యాయస్థానానికి తెలిపారు. వెనక గేటు నుంచి వందల మంది అధికారులు, సిబ్బంది అక్రమంగా చొరబడ్డారన్నారు. లక్షకు పైగా కోళ్లకు వ్యాధులు వచ్చి రూ.కోట్ల రూపాయల నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. మెదక్ కలెక్టర్ నివేదికను తమకు సమర్పించలేదన్నారు.

ప్రభుత్వం, అధికారుల తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్​ను సీఎస్ ఆదేశించారని.. కలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దార్ విచారణ జరిపారని ఏజీ తెలిపారు. ఇంకా పూర్తిస్థాయి విచారణ జరగలేదని.. ప్రాథమిక విచారణ మాత్రమే పూర్తైందని వివరించారు. పిటిషనర్లది కేవలం అనవసర ఆందోళన మాత్రమేనన్నారు. తదుపరి చర్యలను చట్టప్రకారమే తీసుకుంటామని నివేదికలో కలెక్టర్ తెలిపారన్నారు. ఈ నివేదిక ప్రస్తుతం సీఎస్ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు.

ఎవరి ఇంట్లోకైనా వెళ్లి తనిఖీలు చేస్తారా..?

మెదక్ జిల్లా కలెక్టర్ విచారణ తీరుపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నోటీసులు ఇవ్వకుండా ప్రాథమిక విచారణ ఎలా చేస్తారని ప్రశ్నించింది. సుమారు 120 ఎకరాల్లో సమగ్ర క్షేత్రస్థాయి తనిఖీ రాత్రికి రాత్రే చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అధికారులు మీడియా సమావేశానికి వెళ్లేందుకు కారులో కూర్చొని నివేదిక తయారు చేసినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.

మంత్రిపై తీవ్రస్థాయి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించిందని ఏజీ పేర్కొన్నారు. ఇంతకు ముందు ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు, ఫిర్యాదులు రాలేదా అని కోర్టు ప్రశ్నించింది. తీవ్రమైన ఫిర్యాదులు వస్తే మాత్రం కనీసం సమాచారం ఇవ్వకుండా ఎవరి ఇంట్లోకైనా వెళ్లి తనిఖీలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు సహజ న్యాయ సూత్రాలను, భూ రెవెన్యూ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించారని మండిపడింది.

కౌంటరు దాఖలు చేయాలి..

జమున హేచరీస్ భూములు, వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జమున హేచరీస్‌, జమున, నితిన్ రెడ్డిపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. అయితే అధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చునని స్వేచ్ఛనిచ్చింది. మెదక్ కలెక్టర్ నివేదికతో సంబంధం లేకుండా వ్యవహరించవచ్చునని హైకోర్టు తెలిపింది. చట్టప్రకారం నోటీసులు ఇచ్చి తగిన సమయం ఇవ్వాలని పేర్కొంది. విచారణకు సహకరించేలా పిటిషనర్లను ఆదేశించాలని ఏజీ ప్రసాద్ పదేపదే కోరగా.. పిటిషనర్లు సహకరించకపోతే చట్టప్రకారం వ్యవహరించవచ్చునని పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణను జులై 6కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పగటి కర్ఫ్యూ.. కేబినెట్ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details