కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించలేని వైద్య విద్యార్థులను రెండో సంవత్సరంలో తరగతులకు అనుమతించే వ్యవహారంపై(high court on mbbs students petition).. సింగిల్ జడ్జి తీర్పునకు ప్రభావితం కాకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని జాతీయ వైద్య కమిషన్ ను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అందుకు సంబంధించిన వివరాల్ని కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 27 కి వాయిదా వేసింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు అదేశాలిచ్చింది. కొవిడ్ కారణంగా ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం కొన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన.. 114 మంది వైద్య విద్యార్థులను రెండో సంవత్సరం తరగతులకు అనుమతిచ్చేలా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం, జాతీయ వైద్య కమిషన్ ను ఆదేశించాలని కోరుతూ హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్లు వేశారు. మొదటి ఏడాదిలో ఫెయిల్ అయిన సబ్జెక్టులను రెండో ఏడాదిలో రాసుకునేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. సింగిల్ జడ్జి అనుమతించకపోవడంతో ధర్మాసనం ముందుకు అప్పీళ్లు వేశారు. వాటిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఎన్ఎఎంసీకి పూర్తి వివరాలతో వినతి సమర్పించుకునేందుకు విద్యార్థులకు వెసులుబాటు కల్పించింది. ఆ వినతిపై స్వంత్రంగా నిర్ణయం తీసుకోవాలని ఎన్ఎంసీని ఆదేశించింది.