రాష్ట్రంలోని ఆటోనగర్‌లలో పరిశ్రమలు నెలకొల్పడానికి ఏపీఐఐసీ నుంచి తీసుకున్న భూములను ఇతర అవసరాలకు వినియోగిస్తున్న యజమానుల విషయంలో తొందరపాటు చర్యలొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భూవినియోగ మార్పిడికి మార్కెట్ విలువలో 50% సొమ్మును ‘ఇంపాక్ట్ రుసుం’గా చెల్లించాలని ప్రభుత్వం జీవోలు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపింది.
మార్కెట్ విలువలో 50 శాతం రుసుమును చెల్లించాలని కోరడం చాలా ఎక్కువని, ఆ ఆస్తిపై అధికారం ఉన్న వారి హక్కులకు తీవ్ర భంగం కలిగించే రీతిలో ఈ నిర్ణయం ఉందని పేర్కొంది. ఆటోనగర్‌లలోని భూమికి, వెలుపల ఉన్న భూమికి ప్రభుత్వం నిర్ణయించిన రుసుముల విషయంలో తీవ్ర వ్యత్యాసం ఉందని తెలిపింది. ఆ విధంగా నిర్ణయించడం 14వ అధికరణకు విరుద్ధమని పేర్కొంది. చట్టం ముందు అందరూ సమానులే అనే ప్రాథమిక సూత్రానికి భిన్నంగా ప్రభుత్వ నిర్ణయం ఉందంది. ఆటోనగర్‌లలోని భూమి/ప్లాట్ల యజమానులపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. విచారణను జూన్ 16కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు ఇటీవల ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఏపీఐఐసీ, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు.