High Court News: కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు వరదలకు కొట్టుకుపోవడంలో అధికారుల నిర్లక్ష్యం ఉందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, వరద బాధితులకు పరిహారం అందించాలని కోరుతూ భాజపా నేత ఎన్.రమేశ్ నాయుడు దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు స్పందించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జల వనరులశాఖ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, కడప జిల్లా కలెక్టర్, ఆర్డీవో, రాజంపేట తహసీల్దార్‌లకు నోటీసులిచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటరు వేయాలని ఆదేశించింది.
పిటిషనరు తరఫు న్యాయవాది ఆర్.గోపాలకృష్ణ వాదనలను వినిపిస్తూ.. ‘నిరాశ్రయులకు నామమాత్రపు పరిహారం చెల్లించి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. అధికారుల తప్పిదంవల్ల ప్రాజెక్టు కొట్టుకుపోయింది. 2020లోనే గేటు పని చేయడం లేదని అధికారులు గుర్తించినా మరమ్మతు చేయించలేదు. గుడారాలు వేసుకుని అక్కడి ప్రజలు దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారు. బాధితులకు పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి’ అని కోరారు.