ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

hc on amul: అమూల్ పాల సేకరణపై స్టే పొడిగించిన హైకోర్టు

అమూల్ పాల సేకరణ, వ్యాపార అవసరాల కోసం ప్రభుత్వం చేసే ఖర్చుపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నవంబర్ 29 వరకు హైకోర్టు(high court on amul products) పొడిగించింది. నేషనల్ డెయిరీ డెవలప్​మెంట్ బోర్డు దాఖలు చేసిన కౌంటర్ ప్రతిని రికార్డుల్లో చేర్చాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్​తో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశించింది.

By

Published : Oct 22, 2021, 8:47 AM IST

high court on amul milk
high court on amul milk

అమూల్ పాల సేకరణ(high court on amul products), వ్యాపార అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏవిధమైన సొమ్ము ఖర్చుచేయవద్దని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నవంబర్ 29 వరకు హైకోర్టు పొడిగించింది. నేషనల్ డెయిరీ డెవలప్​మెంట్ బోర్డు దాఖలు చేసిన కౌంటర్ ప్రతిని రికార్డుల్లో చేర్చాలని రిజిస్ట్రీకి స్పష్టంచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్​తో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ ఆస్తులను లీజు విధానంలో అమూల్ సంస్థకు బదలాయించే నిమిత్తం రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిల్​పై హైకోర్టు విచారణ జరిపింది. మంత్రివర్గ నిర్ణయాన్ని చట్ట, రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు.

సహకార సంఘాలను నిర్వీర్యం చేయడం కోసమే ఎన్డీబీ

తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వి. ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. 'వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే గుజరాత్​కు చెందిన అమూల్ సంస్థను రాష్ట్రంలోకి తీసుకురావాల్సిన అవసరం ఏముంది. రాష్ట్రంలోని స్థానిక పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను నిర్వీర్యం చేయడం కోసమే ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది. అమూల్ సంస్థ పాల సేకరణ చేసుకునేలా తగిన చర్యలు తీసుకోలని.. విఫలమైతే సస్పెండ్ చేస్తామని పంచాయతీ కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారులు ఉత్తర్వులిచ్చారు. ఎన్డీబీ ద్వారా రాష్ట్రంలోని పాల సహకార సంఘాలు బలోపేతం అయ్యేందుకు ప్రోత్సాహాలు, నిధులు కేటాయించాల్సిన ప్రభుత్వం.. ప్రైవేటు సంస్థ అయిన అమూల్ను తీసుకురావడం సరికాదు. వాణిజ్యం ద్వారా వచ్చే లాభాలు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ భాగస్వాములైన సభ్యులకు చెందుతాయి తప్ప.. ఏపీలోని సహకార సంఘాలకు చెందవు. అమూల్​తో ఒప్పందం వెనుక ప్రభుత్వ దురుద్దేశాలు' ఉన్నాయన్నారు.

వాటి ఆధారంగా న్యాయస్థానం విచారించదు..

ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్డీబీతో ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేము కదా ? అని పిటిషనర్​ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఎవరితో ఒప్పందం చేసుకోవాలనేది ప్రభుత్వ ఇష్టం అని పేర్కొంది. ఫలానా వారితో ఒప్పందం చేసుకోవాలని మీరెలా చెబుతారంది. పాలు ఉత్పత్తి చేస్తున్న మహిళ సహకార సంఘాల ప్రయోజనాల కోసమే అమూల్​తో ఒప్పందం అని ప్రభుత్వం చెబుతోందని గుర్తుచేసింది. అలాంటప్పుడు ఒప్పందంలో తప్పేముందని వ్యాఖ్యానించింది. చట్ట, రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన జరిగాయా లేదా అనే అంశాన్ని మాత్రమే పరిశీలిస్తామంది. వ్యక్తులు, రాజకీయ పార్టీల ఆధారంగా న్యాయస్థానం విచారించదని పేర్కొంది. అమూల్​తో ఒప్పందం ఏ చట్టానికి విరుద్ధమో ఆ అంశంపై వాదనలు చెప్పాలంది.

ఎన్డీబీతో లీటరుకు రూ .4 నుంచి 14 వరకు ప్రయోజనం

అమూల్ వ్యాపార అవసరాల కోసం ప్రభుత్వ నిధులు వినియోగించడం లేదని.. ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. రాష్ట్రంలోని మహిళా పాల ఉత్పత్తిదారులు గతంలో పొందినదానికంటే లీటరుకు రూ .4 నుంచి రూ .14 వరకు ప్రయోజనం పొందుతారన్నారు. అమూల్​కు వచ్చే లాభాల్లో వాటా మహిళ పాల ఉత్పత్తి సంఘాలకు చెందుతుందన్నారు. వ్యాజ్యం దాఖలు వెనుక ఉన్న రాజకీయ కోణాన్ని గమనించాలన్నారు.

ఇదీ చదవండి..

HC ON GO 55: డిగ్రీ కళాశాలల్లో సీట్ల కేటాయింపుపై స్టే పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details