ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే... ఏపీలోనే తక్కువ - EWS

పవన, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించేందుకు సంప్రదింపుల కమిటీని నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని... విద్యుత్ ఉత్పత్తి సంస్థల తరపున న్యాయవాదులు హైకోర్టులో పునరుద్ఘాటించారు. ఒప్పందం సందర్భంగా నిర్ణయించిన విద్యుత్ యూనిట్ టారిఫ్ రేటు కుదించాలని కోరడం చట్ట విరుద్ధమన్నారు. తాము ఉత్పత్తి చేసిన విద్యుత్​ను తీసుకోకుండా... కోత పెట్టడానికి వీల్లేదన్నారు. ఏడాదిగా బకాయిలు చెల్లించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

హైకోర్టు

By

Published : Aug 28, 2019, 11:47 PM IST

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీఏలను సంప్రదింపుల కమిటీని ఏర్పాటు నిమిత్తం... రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 63ను సవాలు చేస్తూ సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. ఆ జీవోతో పాటు... అందుకు అనుగుణంగా ఏపీఎస్పీడీసీఎల్ రాసిన లేఖ అమలును హైకోర్టు నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. బకాయిలు చెల్లించకపోవడం, ఉత్పత్తి చేసిన విద్యుత్​ను తీసుకోకుండా కోత పెట్టడాన్ని సమర్ధించుకోవడానికి ప్రభుత్వం వద్ద కారణాలు లేవని విద్యుత్ సంస్థల తరపు న్యాయవాదులు తెలిపారు.

తప్పని సరిగా నడవాల్సిన కేటగిరి కింద ఉన్న సౌర, పవన విద్యుత్ సంస్థలు ఉత్పత్తి చేసిన విద్యుత్​లో కోత పెట్టడానికి వీల్లేదన్నారు. వినియోగదారుల హితాన్ని దృష్టిలో పెట్టుకొనే టారిఫ్ రేటును ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించిందన్నారు. 2014లో నిర్ణయించిన టారిఫ్ రేటును 2019లో తగ్గించాలనడం కేంద్ర విద్యుత్ చట్ట నిబంధనలకు విరుద్ధమని న్యాయస్థానానికి వివరించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే యూనిట్ టారిఫ్ రేటు చాలా తక్కువన్నారు. కేంద్ర చట్టం పరిధిలో ఉన్న ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం తరపున సహాయ సొలిసిటర్ జనరల్ బి.కృష్ణమోహన్ వాదనలు వినిపిస్తూ... విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు ఒప్పందదారులు కట్టుబడి ఉండాలన్నారు. అక్రమాలు చోటు చేసుకున్నాయని నిర్ధరణ అయితే తప్ప... వాటిని రద్దు చేసుకోవడం కుదరదన్నారు. ఒప్పందం సందర్భంగా పునఃసంప్రదింపుల క్లాజ్​కు తావుంటేనే ఓ టారిఫ్​పై పునఃచర్చకు వీలుంటుందని స్పష్టం చేశారు. నూతన, పునరుత్పాదక కేంద్ర ఇంధన వనరులశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో... లేఖ ఒప్పందాలు ఉల్లంఘించడానికి వీల్లేనివని, ఒప్పందంలో స్పష్టంగా రాసుకుంటే తప్ప పునఃసమీక్షలు కుదరవని పేర్కొన్న విషయం గుర్తుచేశారు.

ఈడబ్ల్యూఎస్​పై పిటిషన్ దాఖలు...
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం ఈడబ్ల్యూఎస్ కేటాయించిన 10శాతం రిజర్వేషన్లను గ్రామ, మున్సిపల్ వార్డుల సచివాలయాల పోస్టులు, తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు చేపట్టిన ఎనర్జీ అసిస్టెంట్ నియామకాల్లో అమలునకు ఆదేశించాలని కోరుతూ... హైకోర్టులో పిల్ దాఖలైంది. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పి.రాకేష్ రెడ్డి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. నియామకాల్లో 10శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే... యువతకు నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయితీరాజ్, పురపాలక, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శులను, తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఇదీ చదవండీ...'పార్టీలు మారేటప్పుడు నైతిక విలువలు పాటించాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details