ప్రచార మాధ్యమాలకు ఇచ్చే ప్రకటనల్లో సీఎం కుటుంబానికి చెందిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు విజయవాడకు చెందిన కిలారు నాగశ్రవణ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. నిర్దిష్టమైన మీడియాను ఎంపిక చేసుకుని ప్రకటనలు ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్న పిటిషనర్ తరపు న్యాయవాది........రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వకూడదన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా సీఎం జగన్....దివంగతులైన తనతండ్రి ఫొటోను ప్రకటనల్లో వాడుతున్నట్లు తెలిపారు. అత్యధిక సర్క్యూలేషన్ కలిగిన ఈనాడు కంటే సాక్షి దినపత్రికకు ఎక్కువ ప్రకటనలు ఇచ్చినట్లు చెప్పారు. వేల సంఖ్యలో సర్క్యూలేషన్ కలిగిన ఆంధ్రప్రభ, ప్రజాశక్తి కంటే మూడో అతిపెద్ద సర్క్యూలేషన్ కలిగిన పత్రికకు తక్కువ ప్రకటనలు ఇస్తున్నట్లు చెప్పారు.
తెదేపాకు సన్నిహితుడు: ఏజీ
ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్....పిటిషనర్ తెలుగుదేశం పార్టీకి సన్నిహితుడని తెలిపారు. ఆంధ్రజ్యోతికి ప్రకటనలు ఇవ్వడం లేదనేది పిటిషనర్ అభ్యంతరంలా ఉందన్నారు. ప్రకటనలకు సంబంధించినఫైళ్లు....ముఖ్యమంత్రి వద్దకు వెళ్లవన్నారు. నేతల బినామీలు, ఆత్మలు ప్రజాప్రయోజనం పేరుతో దాఖలుచేసే పిటిషన్ల అర్హతను ప్రారంభంలోనే తేల్చాలని ఏజీ.....హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.