High Court Green Signal: అమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దేశంలో ఎన్నో యాత్రలు, ఆందోళనలు జరుగుతుంటే.. రైతుల పాదయాత్రపైనే ఆంక్షలు ఎందుకని.. పోలీసుల్ని ప్రశ్నించింది. యాత్రకు అనుమతి లేదన్న డీజీపీ ఉత్తర్వులను పక్కకు పెట్టింది. గత పాదయాత్రలో రైతులు కొందరిపై దాడి చేశారని.. యాత్రతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని ఎస్పీలు నివేదికలిచ్చారన్న ప్రభుత్వ న్యాయవాది వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. పరిమిత ఆంక్షలతో పాదయాత్ర కొనసాగించవచ్చన్న ఉన్నత న్యాయస్థానం.. పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించింది.
ఈ నెల 12 నుంచి నవంబర్ 11 వరకు రాజధాని అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు అడ్డంకులు తొలగాయి. అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు తలపెట్టిన మహాపాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ గురువారం డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు. డీజీపీ ఇచ్చే ఉత్తర్వులను తమ ముందుంచాలని గురువారం హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల చట్టబద్ధతపై మొదటి కేసుగా హైకోర్టు విచారణ జరిపింది. పరిమిత ఆంక్షలతో పాదయాత్ర కొనసాగించవచ్చని... స్పష్టం చేసింది. 600 మందితో పాదయాత్ర చేసుకోవచ్చని తెలిపింది. పాదయాత్రకు అనుమతి కోసం వెంటనే దరఖాస్తు చేయాలని పిటిషనర్‌కు సూచించింది. దరఖాస్తును స్వీకరించి అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. పాదయాత్ర ముగింపు రోజు మహాసభకు ముందస్తుగా అనుమతి తీసుకోవాలని ఆదేశించింది.