ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Heavy Rain in Telangana: తెలంగాణ అతలాకుతలం.. హైదరాబాద్​ జలమయం

గులాబ్ తుపాను తెలంగాణను అతలాకుతలం చేసింది. తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాల(Heavy Rain in Telangana)తో వరదలు ముంచెత్తాయి. కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపించాయి. ఏకధాటిగా కురిసిన వర్షం(Heavy Rain in Telangana) వల్ల చాలాచోట్ల వాగులు పొంగిపొర్లాయి. నిరంతరాయంగా కురిసిన వాన(Heavy Rain in Telangana)తో ప్రజలు బయటకు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు.

Heavy Rain in Telangana
హైదరాబాద్​ జలమయం

By

Published : Sep 28, 2021, 10:15 AM IST

హైదరాబాద్​ జలమయం

గులాబ్‌ తుపాను తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలను వణికించింది. భారీ వర్షాల(Heavy Rain in Telangana)తో ముంచెత్తింది. సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో నిరంతరాయంగా వాన(Heavy Rain in Telangana) కురుస్తూనే ఉంది. అధిక వర్షాలతో పలు ప్రాంతాల్లో కాలనీలు, రోడ్లు నీటమునిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు నిండిపోయాయి.

తడిసి ముద్దయిన రాజధాని

సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేని వాన(Heavy Rain in Telangana)తో హైదరాబాద్‌ నగరం వణికిపోయింది. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు కుండపోతగా కురవడంతో వందలాది కాలనీలు నీటమునిగాయి. నాలాలు, కాలువలు ఉప్పొంగాయి. రహదారులు ఏరులయ్యాయి. అనేక ఇళ్లలోకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవస్థలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. బహదూర్‌పుర చౌరస్తా నుంచి కిషన్‌బాగ్‌ వెళ్లే రహదారిలో నడుము లోతు నీరు నిలవడంతో స్థానికులు తాళ్ల సాయంతో రోడ్డు దాటారు. మాదాపూర్‌ ప్రాంతంలోనూ రహదారులపై మోకాల్లోతు నీరు చేరింది. గ్రేటర్‌ వ్యాప్తంగా సోమవారం రాత్రి వరకు 42 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 10 గంటల వరకూ రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డలో అత్యధికంగా 18.13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జయశంకర్‌ జిల్లా చిట్యాలలో 16.13, సిరిసిల్ల జిల్లా నాంపల్లెలో 15.98, ఖమ్మం జిల్లా బచ్చోడులో 15.15 సెంటీమీటర్లు, కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి-ధర్మారంలో 14.8, జమ్మికుంటలో 14.8, వీణవంకలో 14.3, వైరాలో 14.2, హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో 11.08 సెం.మీ.ల వర్షం కురిసింది.

పంటలకు నష్టం

ఖమ్మం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి తదితర జిల్లాల్లో సోమవారం 12 గంటల వ్యవధిలోనే 10 నుంచి 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ స్థాయి వర్షాలకు పొలాల్లోకి నీరు చేరి పంటలు దెబ్బతింటాయని, నీరు వెంటనే బయటికి వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలని జయశంకర్‌ వర్సిటీ సూచించింది.

ములుగు, జయశంకర్‌, ఖమ్మం జిల్లాల్లో మిరప పంట అధికంగా సాగుచేశారు. మిరప తోటల్లో నీరు ఎక్కువగా నిలిచింది.

పొంగిన వాగులు.. జలమయమైన వీధులు

ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం సాలూర వద్ద మంజీరా నది పాత వంతెనను తాకుతూ ప్రవహిస్తోంది.

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని పల్లిపాడులో, కారేపల్లి మండలంలోని పేరుపల్లిలో రెండు పడక గదుల ఇళ్ల చుట్టూ వరద నీరు చేరింది. వైరా పట్టణం, చింతకాని మండలం నాగులవంచ గ్రామాల్లోని పలు వీధులు జలమయమయ్యాయి. భద్రాద్రి జిల్లా ఎల్చిరెడ్డిపల్లి వద్ద ప్రధాన రహదారి కోతకు గురైంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.

వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలంలో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు సాయమ్మ(40) అనే మహిళ మృతి చెందగా, ఆమె భర్త గాయపడ్డాడు.

సిరిసిల్లను మళ్లీ ముంచెత్తిన వరద

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం మరోమారు జలదిగ్బంధంలో చిక్కుకుంది. సోమవారం కురిసిన వర్షానికి సిరిసిల్ల-కరీంనగర్‌ ప్రధాన రహదారి నీటమునిగింది. శాంతినగర్‌ను వరద ముంచెత్తింది. ఇళ్లు, మరమగ్గాలు, అద్దకం పరిశ్రమల్లోకి వరద చేరింది. కొత్తచెరువు సమీపంలోని పలు కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. ఇటీవలే వర్షాలకు శాంతినగర్‌ ప్రాంతం నీటమునగగా దాని నుంచి కోలుకుంటున్న సమయంలో వరద మళ్లీ ముంచెత్తింది.

బ్యారేజీలకు భారీ వరద

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు భారీగా వరద చేరుతోంది. మేడిగడ్డ(లక్ష్మి) నుంచి 5.98 లక్షల క్యూసెక్కులు, అన్నారం(సరస్వతి) బ్యారేజీ నుంచి 4.58 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ఎల్లంపల్లి, మధ్యమానేరు(శ్రీరాజరాజేశ్వర), దిగువ మానేరు జలాశయాలకు వరద పెరుగుతుండటంతో అన్ని జలాశయాల గేట్లను తెరిచి కిందకు నీటిని వదులుతున్నారు.

నేడూ వర్షాలు

మంగళవారం ఉత్తర తెలంగాణతో పాటు సంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌, కామారెడ్డి, రాజన్న తదితర జిల్లాల్లో భారీ వర్షాలు, ఇతర ప్రాంతాల్లో ఓ మోస్తరుగా కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. మంగళవారం కొన్ని ప్రాంతాల్లోనే భారీ వర్షాలు కురిసే సూచన ఉన్నందున ఆరెంజ్‌ హెచ్చరికను జారీచేసినట్లు ఆమె పేర్కొన్నారు.

బతుకు ‘బండి’ సాయంతో బయటపడ్డాడు

గులాబ్‌ తుపాను ప్రభావంతో సోమవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాల(Heavy Rain in Telangana)కు ఆదిలాబాద్‌ పట్టణ సమీపంలోని బంగారుగూడ వద్ద లోలెవల్‌ వంతెనపై వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొంతసేపటి తర్వాత వరద ప్రవాహం కొద్దిగా తగ్గిందని భావించి పోలీసులు వారించినా కొంతమంది ధైర్యం చేసి వాగును దాటే యత్నం చేశారు. ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై దాటుతుండగా.. అదుపు తప్పి కింద పడిపోయాడు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి బండి హ్యాండిల్‌ను గట్టిగా పట్టుకున్నాడు. వంతెన నుంచి కిందికి జారిపోయేలా కనిపించినా పట్టు వదల్లేదు. స్థానికులు వెంటనే అప్రమత్తమై అతడిని కాపాడారు.

జలదిగ్బంధ గ్రామానికి డ్రోన్‌ ద్వారా మందులు

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కుర్తి గ్రామం అయిదు రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామ శివారులో మంజీర నది రెండు పాయలుగా విడిపోయి చుట్టూ ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచాయి. గ్రామానికి చెందిన మిర్యాల గంగారాం-విజయ దంపతుల కుమారుడు కన్నయ్య అనే 16 నెలల బాలుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని అధికారులకు సోమవారం సమాచారం అందింది. స్పందించిన రెవెన్యూ, పోలీసు, వైద్యశాఖాధికారులు డ్రోన్‌ ద్వారా మందులు చేరవేశారు. గ్రామంలో పలువురు మధుమేహం, రక్తపోటు, జ్వరాలతో బాధపడుతుండడంతో ముందస్తుగా అత్యవసర మందులను పంపించారు.

ఇదీ చదవండి :

GULAB CYCLONE: గులాబ్ కుదిపేసింది..శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు వణికించింది

ABOUT THE AUTHOR

...view details