ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేసుల ఉపసంహరణను కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించకూడదన్న హైకోర్టు - ఏపీ తాజా వార్తలు

High court కేసుల ఉపసంహరణను కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణ అంశంపై విచారణ జరిపిన హైకోర్టు, తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

High Court
హైకోర్టు

By

Published : Aug 17, 2022, 3:55 PM IST

Updated : Aug 18, 2022, 6:19 AM IST

High Court on Public Representatives Cases: సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ప్రజా ప్రతినిధులపై కేసులు ఉపసంహరించేందుకు జీవోలు జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వం ‘డేంజర్‌ జోన్‌’లో ఉందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వ చర్య కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని స్పష్టం చేసింది. ప్రజా ప్రతినిధులపై కేసులను రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించడానికి వీల్లేదని 2020 సెప్టెంబరు 16న సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందని గుర్తు చేసింది. అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేసిందని వ్యాఖ్యా నించింది. కేసుల ఉపసంహరణకు అనుమతిస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చాక రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేయాలని తెలిపింది. అంతేకానీ జీవోలిచ్చి.. హైకోర్టు అనుమతి కోరడమేమిటని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అధికారులు సక్రమంగా అర్థం చేసుకోలేదని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వమే సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. లేకుంటే తామే జీవోలను కొట్టేస్తామని తేల్చి చెప్పింది. ఆ జీవోలను కొట్టేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని, అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా తీర్పులు ఇవ్వాలని కోరుతూ భాజపా నాయకుడు అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ వేసిన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టుల అనుమతి లేకుండా ప్రస్తుత, పూర్వ ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణ కుదరదని ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2020 సెప్టెంబర్‌ 16 నుంచి 2021 ఆగస్టు 25లోపు రాష్ట్రంలో ప్రజాప్రతినిధులపై ఎన్ని కేసుల ఉపసంహరణకు జీవోలిచ్చారు తదితర వివరాల్ని పరిశీలించేందుకు హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. వైకాపా ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చర్యలు తీసుకునేందుకు సిఫారసు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన తొమ్మిది జీవోలను ఈ వ్యాజ్యంలో ప్రస్తావించింది. మరోవైపు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై పది కేసుల ఉపసంహరణకు ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ ఏపీ జర్నలిస్ట్‌ ఫోరం అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు హైకోర్టులో పిల్‌ వేశారు. వైకాపా ఎమ్మెల్యేలు మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావుపై నూజివీడు పట్టణ ఠాణా, కొక్కిలిగడ్డ రక్షణనిధిపై తిరువూరు పోలీసుస్టేషన్లలో నమోదైన కేసుల ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని హైకోర్టు సుమోటో పిల్‌గా మలిచింది. మూడు వ్యాజ్యాలు బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చాయి.

సుప్రీం ఆదేశాలను ప్రభుత్వం ఉల్లంఘించింది..

పిటిషనర్‌ కృష్ణాంజనేయులు తరఫు న్యాయవాది వెంకటేశ్‌ వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ ఎమ్మెల్యేలపై కేసుల్ని ఉపసంహరించేలా జీవోలు జారీ చేసిందన్నారు. ఉపసంహరణ ప్రతిపాదనల సంబంధిత కోర్టు పీపీల నుంచి రావాలన్నారు. అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వమే జీవోలిచ్చి కేసుల్ని ఉపసంహరించాలని పీపీలను కోరిందన్నారు. హోం శాఖ ప్రభుత్వ న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. జీవోలు ఇచ్చినప్పటికీ ఆయా కేసులను ఉపసంహరించలేదన్నారు. హైకోర్టు ఆమోదం తెలిపాకే ఉపసంహరిస్తామన్నారు. వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం.. సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేసి, డేంజర్‌ జోన్‌లో ఉందని వ్యాఖ్యానించింది.

ఎవరెవరిపై కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుందంటే..

వైకాపా ఎమ్మెల్యేలు విడదల రజిని, మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, గంగుల బ్రిజేంద్రరెడ్డి, జక్కంపూడి రాజా, మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు, కొక్కిలిగడ్డ రక్షణనిధి, వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.

ఇవీ చదవండి:

Last Updated : Aug 18, 2022, 6:19 AM IST

ABOUT THE AUTHOR

...view details