మద్యం మత్తులో వాహనాలు నడిపితే కళ్లు, చెవులు, నాడీమండల సామర్థ్యం తగ్గిపోతుంది. బ్రేక్ వేయాలనుకున్నా వేయలేరు. మోతాదుకు మించి మద్యం తాగిన వారు చేసిన ప్రమాదాలను విశ్లేషిస్తున్న ట్రాఫిక్ పోలీస్ అధికారులు చెబుతున్న మాటలివి. మద్యం మత్తులో వాహనం నడపడం ప్రమాదమని పోలీసులు చెబుతున్నా మందుబాబులు వినకపోవటం వల్ల వారిని పట్టుకుని ప్రమాదాలను నియంత్రించేందుకు డ్రంకెన్ డ్రైవ్ సమయాన్ని తెలంగాణలోని హైదరాబాద్‌లో అర్ధరాత్రి దాటాక 2.30 గంటల వరకు పొడిగించారు. మందుబాబులను పట్టుకుంటున్నారు.
ఇల్లు దగ్గరేగా... పోదాం పద
మోతాదుకు మించి మద్యం తాగాక వాహనాన్ని నడపకూడదు. కొందరు మందుబాబులు రెండుమూడు కిలోమీటర్లు వెళితే ఇల్లు చేరుకుంటామనుకుని బైకులు, కార్లపై వేగంగా వెళ్తున్నారు. మలుపులు, రోడ్డుపై ఎత్తుపల్లాలు వచ్చినప్పుడు నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు చేస్తున్నారు. మరికొందరు రాత్రివేళల్లో తక్కువ ట్రాఫిక్ ఉంటుందన్న భావనతో డివైడర్ల వద్ద రాంగ్‌రూట్‌లో వెళుతూ ప్రమాదాలు చేస్తున్నారు. బైక్‌లపై వెళ్లేవారు ప్రధానంగా ఈ తప్పులు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అమీర్‌పేట, బేగంపేట, అబిడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, అంబర్‌పేట, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్ ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు ఇలాంటి కారణాల వల్లే నమోదవుతున్నాయి.
గాయాలైనా బాధ ఉండదు...
ప్రమాదాలయ్యాక వాహనచోదకులు అప్పటికే మద్యం మత్తులో ఉండగా.. గాయాల బాధ అప్పుడు కనిపించదు. తీవ్ర గాయాలైనప్పుడు, రక్తస్రావమైనప్పుడు కూడా తెలియదు. శిరస్త్రాణం లేని వాహనచోదకులకు తలకు బలంగా గాయాలైనా అంతగా వారిని బాధించవు. ఎదైనా వాహనాన్ని లేదా డివైడర్, చెట్టును బలంగా ఢీకొన్నప్పుడు తీవ్రగాయాలైనప్పుడు కూడా వారి అవయవాలు స్పందించే గుణాన్ని కోల్పోతున్నాయి. కొన్ని సందర్భాల్లో భయంతో గుండె ఆగిపోతోంది. వైద్య నిపుణుల ఈ అంశాలను తెలుసుకుని ట్రాఫిక్ పోలీసులు గోషామహల్ ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో మందుబాబులకు వివరిస్తున్నారు.
కంటిపాపలు చూడలేవు...
- మద్యం తాగి నడుపుతున్న వ్యక్తి కొద్దిసేపు బాగానే ఉన్నా.. కారు నడపడం మొదలైన మూడు, నాలుగు నిమిషాలకే కళ్లు మసక, మసకగా మారిపోతాయి. ఎదురుగా వస్తున్న వాహనం కాంతికి కళ్లు మూసుకోవాలనిపిస్తుంది.
- బైక్ లేదా కారు నడుపుతున్నప్పుడు..స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు మాటలు సక్రమంగా ఉండవు. నాలుక మందంగా మారిపోతుంది. సూటిగా మాట్లాడాలనుకున్నా... మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుంది.
- కేవలం ఐదు నిమిషాల్లో మద్యం మత్తు ప్రభావం వాహనచోదకుడిపై చూపిస్తుంది. కాళ్లు, చేతుల మధ్య సమాచార లోపం ఏర్పడుతుంది. చేతులు స్టీరింగ్ తిప్పుతుంటే.. కాళ్లు అందుకు అనుగుణంగా కదల్లేవు.
- మద్యం మత్తులో వాహనం నడుపుతున్నప్పుడు మెదడు ఆలోచించే శక్తి మందగిస్తుంది. మెదడు ఆజ్ఞలిస్తున్నా.. నాడీవ్యవస్థ పనిచేయదు. రహదారిపై ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా రోడ్డు దాటుతున్నా... ఎదురుగా వాహనం వస్తున్నా దాన్ని తప్పించేందుకు ప్రయత్నించే క్రమంలో బ్రేకులు వేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాదు..
- ప్రతిస్పందన సమయం మారడంతో కచ్చితంగా ప్రమాదం జరుగుతుంది. మద్యం తాగున్నప్పుడు బ్రేక్ వేస్తే వంద గజాల దూరం తర్వాత వాహనం ఆగుతుంది. సాధారణ సమయంలో యాభై గజాల్లోనే వాహనం ఆగిపోతుంది.
ఇవీ చూడండి:తూర్పుగోదావరి జిల్లాలో దారుణం