అభ్యంతరకర వ్యాఖ్యలపై హైకోర్టు పరిపాలనాపరంగా వేసిన అనుబంధ పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటరు వేసేందుకు ధర్మాసనం గడువిచ్చింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన పలువురిపై సీఐడీకి ఫిర్యాదు చేసినా చర్యలు లేవంటూ హైకోర్టు అప్పటి ఇంఛార్జి రిజిస్ట్రార్ జనరల్ (ఆర్‌జీ) వ్యాజ్యం దాఖలు చేశారు. మంగళవారం ఈ వ్యాజ్యం విచారణలో హైకోర్టు ఆర్‌జీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. ప్రధాన అఫిడవిట్లో సవరణ చేయాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేశామన్నారు. ఏజీ ఎస్.శ్రీరామ్ కౌంటరు దాఖలు చేయడానికి స్వల్ప గడువు కోరారు.
తనను ప్రతివాదిగా చేర్చుకోవాలని కోరుతూ తెదేపా నేత, మాజీ పోలీసు అధికారి శివానందరెడ్డి వేసిన అనుబంధ పిటిషన్లో న్యాయవాది మురళీధర్‌రావు వాదనలు వినిపించారు. హైకోర్టుపై సామాజిక మాధ్యమంలో అభ్యంతర పోస్టింగుల వెనుక కుట్రకోణం ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. వివరాలను దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని సూచించింది. న్యాయవాది బదులిస్తూ.. ప్రభుత్వ కింద దర్యాప్తు సంస్థ నిష్పాక్షికంగా దర్యాప్తు చేయడం లేదన్నారు. హైకోర్టు 94 మందిపై సుమోటోగా కోర్టుధిక్కరణ కేసు నమోదు చేస్తే కొంతమందిపైనే 12 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే న్యాయవ్యవస్థపై పోస్టింగుల వెనుక ఉండి మొత్తం చేస్తోందన్నారు. ఆ వాదనలపై ఏజీ తీవ్ర అభ్యంతరం తెలిపారు.
వ్యవస్థలు కుప్పకూలుతాయి: ధర్మాసనం