shallow land in AP : దేశవ్యాప్తంగా 2011-13 నుంచి 2018-19 మధ్యకాలంలో కొత్తగా 14.5 లక్షల హెక్టార్ల భూమి సారం కోల్పోయింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో 79,283 హెక్టార్లు, తెలంగాణ రాష్ట్రంలో 39,652 హెక్టార్ల భూమి నిస్సారంగా మారింది. అత్యధికంగా మహారాష్ట్రలో 4,80,094 హెక్టార్ల భూమి ఎడారీకరణ/క్షీణతకు గురై ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంది. 2011-13తో పోలిస్తే 2018-19లో అధిక భూమి క్షీణతకు గురైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 6, తెలంగాణ 17వ స్థానంలో నిలిచాయి. దేశవ్యాప్తంగా 2018-19 నాటికి మొత్తం 9.78 కోట్ల హెక్టార్ల (29.77%) భూమి క్షీణతకు గురైంది. ఆంధ్రప్రదేశ్‌కున్న 1,60,20,500 హెక్టార్ల భూభాగంలో 14.84% (2.37 మిలియన్ హెక్టార్లు) భూమి ఎడారీకరణకు గురైంది. ఇప్పటివరకు అత్యధిక క్షీణతకు గురైన దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వరుస స్థానాలను ఆక్రమించాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ తాజాగా విడుదల చేసిన ‘డెసెర్టిఫికేషన్ అండ్ ల్యాండ్ డీగ్రెడేషన్ అట్లాస్’లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. తాజా సర్వే నిర్వహించిన చివరి అయిదేళ్ల కాలంలో ఏపీలో భూక్షీణత దాదాపు ఒకటిన్నర రెట్లకుపైగా అధికమైంది. అటవీసంపద అంతరించిపోవడమే భూక్షీణతకు ప్రధాన కారణంగా కనిపించింది. తర్వాత నీటికోత, వ్యవసాయభూముల్లో నీళ్లు నిలిచిపోవడం, మానవ తప్పిదాలు వంటివి ఎడారీకరణ, భూక్షీణతకు ప్రధాన కారకాలుగా నిలిచినట్లు ఇస్రో తేల్చింది.
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం భూక్షీణత ఇలా..