రాష్ట్రమంతా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. పట్టణాల నుంచి గ్రామాల వరకు అన్ని చోట్ల సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. నాయకులు పార్టీలకు అతీతంగా భౌతిక దూరం పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.
విశాఖ జిల్లా..
- అనకాపల్లిలో సిద్ధార్థ సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్ర మాలను పలువురు కొనియాడారు.
- చీడికాడ మండలంలో చిక్కుకున్న బీహార్, మధ్యప్రదేశ్ కూలీలకు సరుకులు తహసీల్దార్ అంబేడ్కర్ సరుకులు పంపిణీ చేశారు. ఇళ్లకే పరిమితమైన గిరిజనులకు కోనాం ప్రాంతానికి చెందిన దువ్వు విష్ణుబాబు, దువ్వు శేషుబాబు ఉదారతతో నిత్యవసర సరుకులు పంచిపెట్టారు. 14 గిరిజన గ్రామాల్లో 1,050 కుటుంబాలకు పంపిణీ చేశారు.
- మునగపాక మేజర్ పంచాయతీలో 3000 కుటుంబాలకు మాజీ చైర్మన్, వైకాపా నాయకులు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా..
- పెదపూడిలో పలు గ్రామాల్లోని ప్రజలకు , ఆరోగ్య సిబ్బందికి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి నిత్యావసర వస్తువులు పంపిణి చేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య సిబ్బందికి, ఏ ఎన్ఎమ్ లకు వస్తువులు, దుస్తులు అందజేశారు.
- తునిలో ఇబ్బంది పడుతున్న పురోహితులకు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆర్థిక సహాయం చేశారు. ఒకొక్కరికి రూ. 5 వేలు అందించారు.
- రంపచోడవరంలో తెదేపా నాయకురాలు వై.నిరంజనీ దేవి 6 గ్రామాల్లో బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ప్రతినిధి జాన్ రత్నం ఆధ్వర్యంలో లేనొరా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శరత్ కుమార్ రెవెన్యూ సిబ్బందికి సరుకులు పంపిణీ చేశారు.
- పి.గన్నవరంలో వైకాపా నాయకుడు మంతెన రవిరాజు 1800 కుటుంబాలకు రెండున్నర లక్షల రూపాయల విలువైన కూరగాయలు, పంచదార, కోడిగుడ్లు, వంట సరుకులు పంపిణీ చేశారు. వీటిని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు చేతుల మీదుగా అందించారు.
- రాజవొమ్మంగిలో ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ అనంత బాబు చేతుల మీదుగా పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
కృష్ణా జిల్లా..
- గుడివాడ పట్టణంలో తిండిలేక అకలితో పస్తులు ఉంటున్న వారికి ఆక్వా రైతు చిన్న రాజు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు.
- తిరువూరులో అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు గోల్డ్ అండ్ సిల్వర్ బులియన్ అసోసియేషన్ ప్రతినిధులు భోజన వసతి ఏర్పాటు చేశారు.
- విజయవాడ 15వ వార్డులో వైకాపా నాయకులు పుచ్చకాయలు పంపిణీ చేశారు. సెయింట్ ఆన్స్ పాఠశాల నిర్వాహకులు మధిర రోడ్డు కూడలిలోని చిన్నారులకు భోజన వసతి ఏర్పాటు చేశారు.
నెల్లూరు జిల్లా...
- నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దాదాపు 1500 మంది కార్మికులకు అందించారు. ప్రతి ఒక్కరికి 3 మాస్కుల కిట్ లను డివిజన్ సచివాలయాల అధికారులకు అందించే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
- గూడురులోని అయ్యవారి పాలెం, మేకనూరు గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ కాలనీలలో 150 కుటుంబాలకు ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు.
- ప్రభుత్వ సాయం అందని వారికి చేగువేరా ఫౌండేషన్ అండగా నిలోస్తోంది. చేగువేరా పైలట్ టీమ్ సభ్యుల ఇంటింటికి వెళ్లి నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తోందని ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండ్ల సురేష్ బాబు తెలిపారు.