ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Story Of Bhagawat Sri Ramanujacharya : వైష్ణవత్వానికి వెలుగులద్ధిన వేదాంతి.. విశిష్టాద్వైతం బోధించిన సిద్ధాంతి...రామానుజాచార్యులు

Story Of Bhagawat Sri Ramanujacharya :ఆధ్యాత్మికతకు పుట్టినిల్లుగా విరాజిల్లే.... ప్రాచీన భారతావనిలో వైష్ణవత్వాన్ని దేదిప్యమానంగా వెలిగించిన మహా పురుషుడు... రామానుజాచార్యులు. కులం, మతం పేరిట.. ప్రజల్లో వైషమ్యాల పోరు నడుస్తున్న సమయంలో.. విశిష్టాద్వైతం ప్రబోధించి, అనుసరించిన మహా తత్వవేత్త ఈయన. వెయ్యి ఏళ్ల క్రితమే ఎన్నో సంస్కరణలకు పునాది వేయగా.. వాటి ఫలితాలు నేటికీ కనిపిస్తున్నాయి. దేవాది దేవుడైన ఆది విష్ణువుకు.. జాతి బేధాలు ఉండనవి, నిమ్న జాతి వాళ్లను సైతం దేవుడి సేవలో భాగస్వాముల్ని చేసిన గొప్ప సంస్కర్త. దేవాలయ వ్యవస్థల్ని పూర్తిగా ప్రక్షాళన చేసి.. సమాజంలోని అన్ని వర్గాల వారికీ దేవాలయాల నిర్వహణలో స్థానం కల్పించిన ఘన కీర్తి.. ఆయకే చెల్లుతుంది. అందుకే.. తరాలు గడుస్తున్నా ఆయన సూచించిన విశిష్టాద్వైతం... విశ్వవ్యాప్తం అవుతూనే ఉంది.

Story Of Bhagawat Sri Ramanujacharya
వైష్ణవత్వానికి వెలుగులద్ధిన వేదాంతి.. విశిష్టాద్వైతం బోధించిన సిద్ధాంతి...రామానుజాచార్యులు

By

Published : Jan 28, 2022, 8:01 PM IST

Story Of Bhagawat Sri Ramanujacharya :రామానుజుల అత్యంత భారీ విగ్రహాన్ని చూడాలంటే... తెలంగాణలో హైదరాబాద్‌లోని దివ్యసాకేతం... ఆశ్రమానికి వెళ్లాలి. ఇక్కడే ఆకాశాన్ని తాకే భారీ విగ్రహం కనిపిస్తుంది. ఈ విషయం ఇప్పటికే.. చాలా మందికి తెలుసు. కానీ... ఆయన పవిత్ర పార్థివ దేహం చూడాలంటే.. ఎక్కడికి వెళ్లాలి.? అంటే మాత్రం తడబడిపోతారు. ఎప్పుడో వెయ్యేళ్ల క్రితం మరణించిన రామానుజాచార్యుల శరీరం ఇంకా ఉందా.. !? అంటూ ఆశ్చర్యపోతారు. అలాంటి వాళ్లందరికీ తెలియాల్సిన విషయం... తమిళనాడులోని ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రం శ్రీరంగం ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం భద్రపరిచి ఉంది. పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని రామానుజులు ఇక్కడే పరమాత్మలో వీలమైయ్యారు. ఏటా 2 సార్లు ఆయన కోసం ఓ ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరం, కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు. అందువల్ల ఆయన శరీరం ఎర్రని వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంది.

శాస్త్రాల అవపోసనతో విశిష్టాద్వైత బోధన..

రామానుజాచార్యున్ని.. విష్ణు మూర్తి శేషతల్పమైన.. ఆదిశేషుడి అవతారంగా భావిస్తుంటా రు. శ్రీ రామానుజాచార్యుల వారు.. తమిళనాడు శ్రీ పెరంబదూర్ తాలూకాలో శాలివాహన శకం 939 లో అంటే... 1017లో జన్మించారు. బాల్యం నుంచే ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి కనబర్చే... ఈయన 15ఏళ్లకే ఎన్నో శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. తన సునిశిత పరిశీలనతో సూక్ష్మమైన, క్లిష్టమైన అంశాలను సైతం.. ఆపోసన పట్టారు. ఏకసంతా గ్రహిగా ఎన్నో శాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేసి... వాటిని సామాన్యులకు అందించారు. విశిష్టాద్వైతం... భగవంతుడు, మాయా, జీవుడు... అన్నీ సత్యాలే.

రామానుజాచార్యులు గొప్ప సంస్కర్త..

భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో రామనుజాచార్యుల వారిది కచ్చితంగా ప్రత్యేక స్థానమే. వెయ్యేళ్ల క్రితం అంటే... శైవ, వైష్ణువులు వేరువేరుగా ఉంటూ.... ఒకరిపై ఒకరు విద్వేషాలను నింపుకునే వారు. సామాన్యుల్లోనే తక్కువ, ఎక్కువ అంటూ విపరీత వ్యత్యాసాలు కనిపిస్తుండేవి. చాలామంది నిమ్నవర్గాలకు.. ఆలయ ప్రవేశమే లేని కాలమది. కనీసం దేవాలయ పరిసరాలకు సైతం రానిచ్చే వాళ్లు కాదు. అలాంటి కాలంలో.. అందరూ సమానమే అనే సర్వమానవ సమభావ సిద్ధాంతం ప్రతిపాదించారు. రామానుజాచార్యులు. అప్పటికీ.. అది పెద్ద విప్లవమనే చెప్పాలి. దేవుడికి.. కులాలు, మతాలు లేని ఆయన దృష్టిలో అందరూ సమానమేనంటూ ప్రజల్లో ఆలోచన రేకెత్తించారు. భేదభావాలు ఎక్కువగా ఉన్న సమయంలో సమాతా భావంతో అందరినీ ఒక్కటి చేసిన గొప్ప సంస్కర్త రామానుజాచార్యులు.

అన్ని వర్గాల వారికి దేవుడి సేవలో సమప్రాధాన్యత..

దళితులకు ఆలయ ప్రవేశం చేయించిన రామానుజాచార్యులు.. వాళ్లను అర్చకులుగానూ మార్చారు. పేదల ఇళ్లల్లో, దేవాలయాల్లో పూజారులుగా ఏర్పాటు చేసి గౌరవించారు. ప్రజల చేత గౌరవించేలా చేశారు. అంతే కాదు, దేవాలయ నిర్వహణ వ్యవస్థలనూ పూర్తిగా మార్చివేశారు. అన్ని వర్గాల వారికీ దేవుడి సేవలో సమప్రాధాన్యత ఇచ్చేలా చేశారు. తన జీవితాంతం, ఇదే విషయాన్ని బోధించారు. ఈయన నేతృత్వంలో ఏర్పాటైన... ఆల్వారుల వ్యవస్థను సైతం... ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే నిర్వహించారు. అంతర్జాతీయంగా.. వైష్ణవాన్ని ప్రచారం చేసేందుకు 12 మంది ఆల్వారులను నియమించగా... వారిలో ఒకరే బ్రాహ్మణుడు. మిగతా వారు.. అన్ని కులాలు వాళ్లూ ఉన్నారు. పైగా వీరిలో ఒకరు స్త్రీ కావడం విశేషం. వీరంతా పూజ్యనీయులన్న రామానుజులు... కుల, లింగ భేదాలకు అతీతంగా జీవించారు. సమాజంలో ఎన్నో సంస్కరణలు ఎన్నో చేశారు. వర్ణ వ్యవస్థలోని ఎలాంటి అసమానతలను సహించేవారు కాదు. ఆయన శిష్యులలో చాలామంది నిమ్న వర్గాల వారే... దేవుడి రథయాత్ర సమయంలోనూ వాళ్లే ముందుగా రథాన్ని లాగేవారు. ఇప్పటికీ అదే సంప్రదాయం కొనసాగుతోంది.

గోపురం ఎక్కి ముక్తిమంత్ర ఉచ్ఛరణ..

ఓసారి రామానుజాచార్యుల చెవిలో.. ఆయన గురువు అష్టాక్షరీ ముక్తిమంత్రం ఉపదేశించా రు. ఆ మంత్రాన్ని... ఇతరులకు చెబితే విన్నవాళ్లు స్వర్గానికి పోతారని, చెప్పిన వాళ్లు నరకానికి పోతారని చెబుతారు. అంతే.. కొందరికే పరిమితమైన ఆ అష్టాక్షరీ ముక్తి మంత్రాన్ని తిరుకొట్టియూర్ ఆలయం గోపురం పైకెక్కి అందరికీ వినిపించారు.. రామానుజాచార్యులు. అంత మంది జనం స్వర్గానికి చేరుకునేందుకు... తాను ఒక్కడినీ నరకానికి వెళ్లినా ఫర్వాలేదంటూ.. తన చర్యను సమర్థించుకున్నారు. ఇలా సమ భావన, సహ జీవన, సమతా భావాలను ఆనాడే ఆయన ప్రతిపాదించారు. హిందూ మతంలో ఎన్నో గొప్ప సంస్కరణలకు ఆద్యుడయ్యారు.

తిరుమలతో ప్రత్యేక అనుబంధం..

వెయ్యేళ్ల క్రితమే ఎన్నో గొప్ప సంస్కరణలకు ప్రాణం పోసిన రామానుజుల వారికి.. తిరుమల ఆలయంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ కాలంలో.. కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి విగ్రహం విష్ణువు రూపానిదా? శివ రూపానిదా? లేక... మరేదైనా రూపంలోని అమ్మవారి రూపానిదా అన్న సందేహం, వివాదం అపట్లో నడిచింది. వైష్ణవులు, శైవులకు మధ్య వాదోపవాదాలు జరిగాయి. వీటన్నింటికీ.... పరిష్కారం చూపింది రామానుజాచార్యులే. తిరుమల స్వామి గర్భాలయంలో శంఖు చక్రాలు ఉంచగా తెల్లవారే సరికి... స్వామి వాటిని ధరించి కనిపించారని చెబుతుంటారు. అంతే కాదు.. ఇప్పుడు వెంకటేశ్వర స్మామికి అలంకరిస్తున్న నామాలు సైతం.. రామానుజాచార్యులే దిద్దారు. ఆయన సూచింటినట్టే... ఇప్పటికీ నామధారణ జరుగుతుంటుంది. అక్కడ వెయ్యేళ్ల క్రితం ఆయన ఏర్పాటు చేసిన సంప్రదాయాలు... నేటికీ అవిచ్ఛనంగా కొనసాగుతూనే ఉన్నాయి.

గోవిందరాజుల ఆలయ ప్రతిష్ఠాపన..

తిరుమల వేంకటేశ్వర స్వామివారికి నిర్వహించాల్సిన అన్ని కార్యక్రమాల్ని రామానుజాచార్యులే నిర్ణయించారు. ఏ రోజు ఎలాంటి వస్త్రధారణ చేయాలి, ఏఏ నైవేద్యాలు సమర్పించాలి అన్న విషయాల్ని ఈయనే నిర్దేశించారు. తిరుమలలో వైఖానస ఆగమాన్ని గౌరవించి ఆ పద్దతులు కొనసాగించారు. తిరుమలలో రామానుజాచార్యులు ప్రవేశ పెట్టిన ఎన్నో సంప్రదాయ పూజా పద్దతులు నేటికీ కొనసాగుతున్నాయి. తమిళనాడులోని కుంభకోణంలో ఓ రాజు... వైష్ణవాన్ని నాశనం చేసేందుకు అక్కడి ఓ దేవాలయంలోని విగ్రహాన్ని సముద్రం ముంచేస్తాడు. దాంతో.. అక్కడి నారాయుణ్ని పోలిన విగ్రహాన్ని తయారు చేయించి... తిరుపతిలో గోవిందరాజుల దేవాలయాన్ని నిర్మించారు. ఆలయప్రతిష్ఠాపన కూడా ఆయన నేతృత్వంలోనే జరిగింది.

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు..

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించి... అనేక దేవాలయాల్ని పునరుద్ధరించారు. వాటిల్లో ఉత్తమ పూజా, నిర్వహణ వ్యవస్థల్ని ఏర్పాటు చేశారు. విష్ణుభక్తులందరూ వైష్ణవులేనని శ్రీ రామానుజులవారు ఉద్భోధించారు. శ్రీరంగనాథుని దేవాలయ పూజావిధానాలు సంస్కరించి కొన్ని ముఖ్య పద్ధతులు ప్రవేశపెట్టారు. శ్రీరంగం, తిరుపతి, కాంచీపురం తదితర వైష్ణవాలయాలలో ఆచారాలు, పూజా విధానాలు ప్రవేశపెట్టారు. భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రచించారు. వారి గ్రంథాలలో అతి ప్రాచుర్యమైనవి వేదాంత సంగ్రహం – వేదాలపై భాష్యం, భగవద్గీతా భాష్యం, బ్రహ్మసూత్రాలపై... శ్రీ భాష్యం, వేదాంత సారం, వేదాంత దీపిక, గద్య త్రయం అనే శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యం, శ్రీ వైకుంఠ గద్యాల్ని రచించారు. వీటిలో పాటే.. తన విశిష్టాద్వైతాన్ని సమర్థించేలా... ఎన్నో రచనలు చేశారు.

ఇదీ చూడండి:భయం అనే వ్యాధికి దివ్యౌషధం భక్తి మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details