తెలంగాణ నిర్మల్ జిలా లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామంలో తలెత్తిన ధాన్యం వివాదం(Grain purchases issues) పక్షం రోజులుగా ముదురుతూనే ఉంది. గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు చేసిన పొరపాటుతో తలెత్తిన వివాదం గ్రామస్థులను రెండు వర్గాలుగా చీల్చింది. ఒక వర్గం వారు అకారణంగా జరిమానాలు విధించి... తమను బహిష్కరించారంటూ ఆరోపిస్తున్నారు. మరో వర్గం వారు తాము నచ్చని వారితో మాట్లాడడం లేదని.. ఎలాంటి బహిష్కరణలు చేయలేదని చెబుతున్నారు. ఇలా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఏం జరిగింది?
ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించిన రైతులు తమకు డబ్బులు తక్కువ వచ్చాయని నిర్వాహకుడిని నిలదీయగా.. ఆయన నిరక్ష్యంగా సమాధానం చెప్పడం వల్ల ఈ పరిణామాలు తీవ్రరూపం దాల్చాయని స్థానికులు అంటున్నారు. ఈ సమస్యను కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి విచారణ జరపాలని కోరారు. తరుగు పేరుతో భారీగా కోతలు విధించి... ఆ డబ్బులను నిర్వాహకుడు బినామీల ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు రైతులు వినతిపత్రంలో ఆరోపించారు. దీనిపై ఈనాడు- ఈటీవి భారత్ పరిశీలన చేయగా పలు విషయాలు వెల్లడయ్యాయి.
పట్టా ఒకరిది .. సొమ్ము మరొకరికి ..
గ్రామంలో ఎత్తిపోతల పథకం ఉండడంతో సాగు భూమిలో దాదాపు 80 శాతానికి పైగా వరి పంటనే సాగు చేస్తారు. ధాన్యం దిగుబడులూ అధికమే. కాగా యాసంగిలో పండించిన ధాన్యాన్ని స్థానికంగా ఉన్న డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. ధాన్యంలో తేమ, తాలు పేరుతో క్వింటాకు కిలో నుంచి 7 కిలోల వరకు కోత విధించారని రైతులు తెలిపారు. డబ్బులు తక్కువ రావడంతో అనుమానం వచ్చిన రైతులు జిల్లా కార్యాలయానికి వెళ్లి రికార్డులను తెచ్చి పరిశీలించారు. లారీలో నలుగురు రైతుల సరుకు వెళ్లగా ఐదుగురి పేరిట నమోదై ఉందని చెప్పారు. ఇలా ప్రతి లారీలో కోతలు విధించిన ధాన్యం డబ్బులను బినామీల పేరిట పలుమార్లు తూకం వేశారని ఆరోపించారు. ఆ డబ్బులను బినామీల ఖాతాల్లోకి మళ్లించినట్లు పరిశీలనలో తేలిందని చెప్పారు.
ఎన్నో అనుమానాలు
వాస్తవంగా ఏ రైతు వద్ద ధాన్యం కొనుగోలు చేశారో అదే రైతు ఖాతాలో డబ్బులు జమ చేయాలి. కానీ ఇక్కడ ఒక రైతు పేరున ధాన్యం కొనుగోలు చేసి మరో వ్యక్తి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు మళ్లించినట్లు తేలింది. ఇలా జిల్లాలోని సోన్ మండలం కడ్తాల్‌లో నిర్వాహకుడు 60 బస్తాల ధాన్యం కాజేసి రూ.80 వేలు తన ఖాతాలో జమచేసుకున్నారని రైతులు తెలిపారు. జాఫ్రాపూర్‌లో 110 బస్తాలను నిర్వాహకుడు తనతో పాటు ముగ్గురు బినామీల పేరుతో రూ.1.80 లక్షలు స్వాహా చేశారని అన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలోనూ కొన్ని కేంద్రాలలో నిర్వాహకులు చేతివాటం ప్రదర్శించారని అనుమానాలు ఉన్నాయి.